Let's talk: editor@tmv.in
సీఎం సీపీఆర్వో ప్రభుత్వ ఉద్యోగా? కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తా: బీఆర్‌ఎస్‌

సీఎం సీపీఆర్వో ప్రభుత్వ ఉద్యోగా? కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తా: బీఆర్‌ఎస్‌

Pinjari Chand
29 ఆగస్టు, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి కాంగ్రెస్‌ పార్టీ కమ్యూనికేషన్‌ వ్యూహ సమావేశంలో పాల్గొనడం రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో సీఎం ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్వో), గ్రూప్‌-1 అధికారి మల్సూర్‌ పాల్గొని శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీఆర్‌ఎస్‌ ఆరోపించింది.

ఎక్స్‌లో పోస్ట్‌తో వివాదం

కాంగ్రెస్‌ ఎంపీ, పార్టీ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో సమావేశానికి సంబంధించిన ఫొటోలను తొలుత పోస్టు చేశారు. అందులో మల్సూర్‌ పార్టీ నేతలతో కలిసి కనిపించారు. సమావేశంలో రాజకీయ అంశాలు, డిబేట్లు, ప్రెస్‌మీట్లను ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకు బలమైన, వాస్తవ ఆధారిత సమాచారాన్ని ఎలా అందించాలనే అంశాలపై చర్చించినట్లు ఎంపీ పేర్కొన్నారు. అయితే ఆ పోస్టును అనంతరం తొలగించిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. మల్సూర్‌ పేరు, ఆయన కనిపిస్తున్న ఫొటోలను తొలగించి కొత్త పోస్టును పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు కమ్యూనికేషన్‌ వ్యూహంపై మీడియా, సోషల్‌ మీడియా బృందాలతో చర్చించినట్లు కొత్త పోస్టులో పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ తీవ్ర విమర్శలు

ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి ఎం.క్రిశాంక్‌ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ అధికారి పార్టీ కార్యాలయంలో శిక్షణా శిబిరం నిర్వహించవచ్చా? అంటూ ప్రశ్నించారు. గ్రూప్‌-1 అధికారి, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి సీపీఆర్వోగా పనిచేస్తున్న మల్సూర్‌ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మీడియా, సోషల్‌ మీడియా బృందానికి శిక్షణ ఇవ్వడం అత్యంత చెడు సంప్రదాయానికి నాంది అని విమర్శించారు. మరో బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి పుట్టా విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ మీడియా, సోషల్‌ మీడియా బృందాలకు బీఆర్‌ఎస్‌ను డిబేట్లు, సోషల్‌ మీడియాలో ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై సీఎం ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సూచనలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం సీపీఆర్వో ప్రభుత్వ ఉద్యోగా? కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తా? అని ఆయన నిలదీశారు. అధికారి జీతం, అలవెన్సులు, ఇతర సౌకర్యాలన్నీ రాష్ట్ర ఖజానా నుంచి అందుతున్నాయని, అలాంటి అధికారి పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగమేనని ఆరోపించారు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారి కాంగ్రెస్‌ పార్టీ కమ్యూనికేషన్‌ వ్యూహ సమావేశంలో పాల్గొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

సీఎం సీపీఆర్వో ప్రభుత్వ ఉద్యోగా? కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తా: బీఆర్‌ఎస్‌ - Tholi Paluku