Let's talk: editor@tmv.in
సీఎం వర్చువల్‌గా జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

సీఎం వర్చువల్‌గా జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

Gaddamidi Naveen
10 డిసెంబర్, 2025

తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా కలెక్టరేట్ల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 వేదికగా, భారత్ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా నిర్వహించిన కార్యక్రమం ద్వారా అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలకు సీఎం ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, దేశ–విదేశాల ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు. గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులకు తెలంగాణ సంప్రదాయం, సంస్కృతి, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఈ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ తల్లి రాష్ట్ర ప్రజల ఆశయాలకు ప్రతీక అని, ఆమె స్ఫూర్తితోనే ప్రభుత్వం ప్రతి రోజూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలతో సహా అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రజా ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తుందని అన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఆ సంకల్పానికి ప్రతీకగా చేపట్టినట్టుగా తెలిపారు. అలాగే యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో, అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకు తొలి అధికారిక ప్రక్రియ ప్రారంభించిన చారిత్రక దినమని గుర్తుచేశారు. ఆ నిర్ణయం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడమే కాకుండా, ప్రాంత ప్రజలకు ఆత్మగౌరవాన్ని అందించిందని అన్నారు.

గతేడాది సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజల్లో స్ఫూర్తిని నింపామని, ఈ సంవత్సరం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో విగ్రహాల ఆవిష్కరణ జరగడం రాష్ట్ర గర్వకారణమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు రూ. 17.5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసింది.మొత్తం 18 అడుగుల ఎత్తుతో విగ్రహాల నిర్మాణం జరిగింది.