
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 31 గడువుకు ముందు శనివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తం 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నేరుగా ఒక ముఖ్యమంత్రి సమక్షంలో ఇంతమంది లొంగిపోవడం ఇదే తొలిసారి కావడం చర్చనీయ అంశంగా మారింది.
తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, లొంగిపోయిన 130 మందిలో 125 మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి, నలుగురు తెలంగాణకు, ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. కాగా, వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు తమతో పాటు 124 అత్యాధునిక ఆయుధాలను అప్పగించారు. వాటిలో ఏకే-47 రైఫిళ్లు కూడా ఉన్నాయి. అలాగే వివిధ రకాల 5,200కిపైగా లైవ్ అమ్యూనిషన్ కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో దేశంలో మావోయిస్టులు లొంగిపోయిన సందర్భాల్లో అత్యధిక సంఖ్యలో, నాణ్యత పరంగా కూడా పెద్ద మొత్తంలో ఆయుధాలు సమర్పించిన ఘటన ఇదే అని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆయుధాలు పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీకి చెందినవని అధికారులు తెలిపారు.
“ఇప్పుడిప్పుడే తెలంగాణలో మావోయిస్టుల రాష్ట్ర కమిటీ అనే వ్యవస్థ పూర్తిగా లేకుండా పోయింది. అది పూర్తిగా అంతరించిపోయింది,” అని డీజీపీ తెలిపారు. ఈ లొంగిపాటు వల్ల నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావొయిస్ట్ ) సంస్థ కార్యకలాపాలు గణనీయంగా బలహీనపడ్డాయి అని పేర్కొన్నారు. ముఖ్యంగా సెంట్రల్ రీజినల్ బ్యూరో పరిధిలో చాలాకాలంగా కొనసాగుతున్న తిరుగుబాటు కార్యకలాపాలకు ఇది ముగింపు దిశగా ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రతీకాత్మకంగా తమ ఆయుధాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని, ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే మావోయిస్టులకు ప్రాణరక్షణ కల్పించడంతో పాటు, సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం అన్ని రకాల సాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
జనవరి 2024 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన తెలిపారు. లొంగిపోయిన వారికి ఆరోగ్య సేవలు, ఆర్థిక సహాయం, గృహ సదుపాయాలు వంటి పునరావాస చర్యలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు.
జనజీవన స్రవంతిలో కలవాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిలుపును విశ్వసించి మావోయిస్టులు ముందుకు రావడం శుభపరిణామమన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెరుగైన ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వంతో, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఇందిరమ్మ ఇళ్లతో పాటు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.
లొంగిపోయిన వారి ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా, వారికి ఆర్థిక సహాయం, ఇతర వసతులు కల్పిస్తామనే నమ్మకం కలిగించిన పోలీసు ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావ్(గణపతి)తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోవాలని రేవంత్ రెడ్డి కోరారు. సాధారణ ప్రజల జీవితంలో భాగస్వాములు అయి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన సూచించారు.
ఇటీవల మాజీ మావోయిస్టు నేతలు దేవ్‌జీ, దామోదర్ తదితరులు తనను కలసి లొంగిపోయే మావోయిస్టులకు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీని పెంచాలని ప్రతిపాదనలు చేశారని సీఎం తెలిపారు. ఆ ప్రతిపాదనలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
మహాత్మా గాంధీ తన శాంతియుత పోరాటంతో ఒక యుద్ధాన్ని జయించిన స్థాయిలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని సీఎం గుర్తుచేశారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని, నేడు దేశాల మధ్య యుద్ధాలు జరిగినా చివరకు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్ల పట్ల సానుభూతితో కూడిన సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే మావోయిస్టులపై ఉన్న పెండింగ్ కేసులను పరిశీలించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేసి, చట్టపరమైన పరిమితుల్లో వాటిని ఉపసంహరించే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
ఇక లొంగిపోయిన 130 మంది మావోయిస్టులకు మొత్తం రూ.4.18 కోట్లకు పైగా నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలంగాణ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 24న నిషేధిత సీపిఐ(మావోయిస్టు) సంస్థకు చెందిన కీలక వ్యూహకర్తగా గుర్తింపు పొందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ కూడా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజి రెడ్డి, అలాగే బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, నూనే నరసింహా రెడ్డి (గంగన్న) కూడా ఆయుధాలు వదిలి లొంగిపోయారు.
ముఖ్యమంత్రి సమక్షంలో మావోయిస్టుల లొంగుబాటు సమయంలో తెలగాణ డీజీపీ శివధర్ రెడ్డి, అదనపు డీజీ (ఇంటలిజెన్స్) విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి, ఇతర అధికారులు ఉన్నారు.
