Let's talk: editor@tmv.in
సీఎం రేవంత్ రెడ్డి 'తిట్ల ట్రాప్'లో పడకండి.. ప్రజా సమస్యలపైనే మన సమరం: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి 'తిట్ల ట్రాప్'లో పడకండి.. ప్రజా సమస్యలపైనే మన సమరం: కేటీఆర్

Gaddamidi Naveen
7 ఫిబ్రవరి, 2026

వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “తిట్ల ట్రాప్”లో ఎవరూ పడవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులు, తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ చర్చలు వ్యక్తిగత విమర్శల దిశగా మళ్లుతున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలు లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు ఆయ‌న‌ సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాజీ సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది కేవలం వ్యక్తిపై దాడి కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రపై దాడిగా ఆయన అభివర్ణించారు. పద్నాలుగేళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ప్రజలు గుర్తుంచుకుంటారని ఆయ‌న పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో అసలు చర్చ స్థానిక సమస్యలపై జరగాలని కేటీఆర్ అన్నారు. వార్డుల్లో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపైనే ప్రజలతో మాట్లాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతులకు ఎరువుల కొరత, రైతు భరోసా ఆలస్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు, గురుకులాల్లో జరిగిన ఘటనలు వంటి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

అలాగే రిటైర్‌మెంట్ ప్రయోజనాల కోసం తిరుగుతున్న వృద్ధులు, డీఏలు, పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై నిలబడాలని కోరారు. సింగరేణి, విద్యుత్ రంగాలకు సంబంధించిన ఆరోపణలు, నీటి వాటాల అంశాలను కూడా ప్రజల్లో చర్చకు తీసుకురావాలని ఆయ‌న‌ సూచించారు.

ప్రజల తీర్పే కేసీఆర్‌కు నిజమైన గౌరవమని పేర్కొన్న కేటీఆర్, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పునరుద్ఘాటించారు.

సీఎం రేవంత్ రెడ్డి 'తిట్ల ట్రాప్'లో పడకండి.. ప్రజా సమస్యలపైనే మన సమరం: కేటీఆర్ - Tholi Paluku