
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా ‘తొలి ముద్ద’ పథకం ప్రారంభం
రాష్ట్రంలోని అంగన్వాడీ చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించేందుకు ప్రభుత్వం రూపొందించిన ‘తొలి ముద్ద’ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, పలు అంగన్‌వాడీ టీచర్లు, పలువురు పిల్లలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలో ఆహార భద్రత ఉన్నప్పటికీ పోషకాహార భద్రత లోపించిందని వ్యాఖ్యానించారు. బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందించడమే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పునాది అవుతుందని తెలిపారు.
పథకం ద్వారా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు ప్రతి ఉదయం పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి ఆహార పదార్థాలు అందించనున్నారు. ఇదే సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీని ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అద్దె భవనాల్లో కాకుండా వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు సొంత భవవాల్లో కొనసాగేలా కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు.
దేశ అభివృద్ధిలో విద్య, నీటిపారుదల ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయో, రాబోయే తరాల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. ఆరేళ్ల లోపు పిల్లలకు సరైన ఆహారం అందకపోవడం వల్ల భవిష్యత్తులో మానసిక వికాసం దెబ్బతింటుందని, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమని, వారిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడిన వెంటనే వారి సమస్యలను పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు.
‘తొలి ముద్ద’ పథకం కేవలం ఆకలి తీర్చడమే కాదు… తెలంగాణ భవిష్యత్తు తరాల శారీరక, మానసిక వికాసానికి బలమైన పునాది వేయనుందని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం పౌష్టికాహార లోపానికి రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవనుంది.
