
సీఎం రేవంత్ రెడ్డి ఏనాటికైనా ‘బీజేపీ’ మనిషే: కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బాన్సువాడలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. రేవంత్ రెడ్డి అసలు రంగును ప్రజలకు వివరించారు.
రేవంత్ రెడ్డి ఏనాటికీ కాంగ్రెస్ మనిషి కాలేడని, ఆయన ఎప్పుడూ బీజేపీ మనిషేనని కేటీఆర్ విమర్శించారు. ఆయన కప్పుకున్న కాంగ్రెస్ ముసుగును తొలగించి చూడండి.. లోపల బీజేపీ నేత కనిపిస్తారు. ఆయన ముమ్మాటికి 'బడే భాయ్' (మోదీ) తమ్ముడే" అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని మైనారిటీలు, మత రాజకీయాలను వ్యతిరేకించే వారు రేవంత్ రెడ్డి అసలు నైజాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగడం అర్థరహితమని కేటీఆర్ విమర్శించారు. గత రెండు సంవత్సరాల్లో పట్టణాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే, గతంలో చేసినట్లే పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మైనారిటీలు, బీసీలకు భారీ బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలైతే మాత్రమే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, రూ. 4000 పెన్షన్, మహిళలకు రూ. 2500 ఆర్థిక సహాయం, విద్యా భరోసా, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు కాలేదని కేటీఆర్ పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఏమిటో బాన్సువాడ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
పోచారంపై నిప్పులు
బాన్సువాడ అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషిని మర్చిపోయి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ సంకన చేరారని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై చేసిన విమర్శలను గుర్తుచేస్తూ, ఆడియో, వీడియో క్లిప్పులను సభలో వినిపించినట్లు తెలిపారు. గతంలో కేసీఆర్‌తోనే ఉంటానని చెప్పిన పోచారం ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడంపై ప్రశ్నించారు. డబ్బులు ఉన్నంత మాత్రాన పెద్ద నాయకుడు కాలేడని, దమ్ముంటే పోచారం రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని కేటీఆర్ సవాల్ విసిరారు. బాన్సువాడ ప్రజలు మళ్లీ గులాబీ జెండా ఎగరాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
