Let's talk: editor@tmv.in
సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

Gaddamidi Naveen
10 ఫిబ్రవరి, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వికారాబాద్‌లో నిర్వహించిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రాజకీయ ప్రచార వేదికగా మార్చుకున్నారని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా. కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ, "ప్రజా పాలన - ప్రగతి బాట" అనే ప్రభుత్వ కార్యక్రమంలో మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ చేపడుతూ, ముఖ్యమంత్రి ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రసంగించారని విమర్శించారు. చెక్కుల పంపిణీతో పాటు 6,650 మహిళా స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి సహాయం అందించే కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చారని విమర్శించారు. అధికారిక ప్రభుత్వ కార్యక్రమాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అభ్యర్థించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని తెలిపారు.

అలాగే ప్రభుత్వ వేదిక, ప్రజా నిధులు ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించారని ఆరోపించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారితో “జై కాంగ్రెస్” వంటి నినాదాలు చేయించడం ద్వారా బహిరంగ ఎన్నికల ప్రచారం నిర్వహించారని పేర్కొన్నారు. ప్రభుత్వ సహాయంపై ఆధారపడిన లబ్ధిదారుల ఉనికిని ఉపయోగించి రాజకీయ ఒత్తిడి సృష్టించడం కూడా ఎంసీసీకి వ్యతిరేకమని అన్నారు.

ఎన్నికల సమయంలో అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలు చేయడం రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అధికార దుర్వినియోగంగా పరిగణించాల్సిన విషయమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో డా. కురువ విజయ్ కుమార్, మన్నె గోవర్ధన్ రెడ్డి, బొమ్మెర రామమూర్తి, కార్తీక్ రాయల తదితరులు పాల్గొన్నారు.