
సీఎం రేవంత్ రెడ్డిపై అసెంబ్లీ సెక్రటరీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు
తెలంగాణ శాసనసభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ తిరుపతికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు.
కృష్ణా జలాల అంశంపై చర్చ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను సీఎం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు గణాంకాలతో సభను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని వారు విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సభలో అసత్యాలు పలకడం సభా హక్కులను ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, సీఎం రేవంత్ రెడ్డిపై తక్షణమే సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని వారు సెక్రటరీని కోరారు. ఈ ఫిర్యాదు తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల్లో వేడిని పెంచింది.
