
సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ
అమెరికాలోని డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు విద్య, వైద్యం, డేటా ప్రివెన్షన్ విధానాలు, యూనివర్సల్ హెల్త్ కేర్ అమలు వంటి కీలక అంశాలపై రంగాలలో పరస్పర సహకారంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశంలో డెలావర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి గవర్నర్ మాట్ మేయర్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలు, విద్యా అవకాశాలు, రుణమాఫీ కార్యక్రమాలు వంటి చర్యల ద్వారా సామాజిక సమానత్వాన్ని ఎలా పెంపొందిస్తున్నారో వివరించారు. ఈ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం, డెలావర్ రాష్ట్రం మధ్య పరస్పర సహకారం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. విద్య, ఆరోగ్యం, సాంకేతికత, పెట్టుబడులు వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రతినిధుల బృందంతో కలిసి డెలావర్ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా గవర్నర్ మాట్ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెలావర్ గవర్నర్‌కు ‘తెలంగాణ–2047’ విజన్ డాక్యుమెంట్‌ను అందజేశారు. తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళికలను ఈ పత్రంలో వివరించినట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీతో తెలంగాణ, డెలావర్ మధ్య భవిష్యత్తులో సహకార అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.
