Let's talk: editor@tmv.in
సీఎం రేవంత్ రెడ్డితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ భేటీ

Gaddamidi Naveen
14 జులై, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్సీఎస్సీ) చైర్‌పర్సన్ కిశోర్ మక్వానా సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కమిషన్ ప్రతినిధి బృందంతో కలిసి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణలు, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా విద్యా రంగంలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులను ముఖ్యమంత్రి కమిషన్‌కు వివరించారు. ముఖ్యంగా విద్యార్థుల మధ్య కుల వివక్షను పూర్తిగా రూపుమాపేందుకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అలాగే, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించేందుకు ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటు చేశామని, ఇక్కడ విద్యార్థులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌తో పాటు రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. వీటిని మొదటగా కోర్ అర్బన్ రీజియన్లలో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామని, రాజకీయ, ఇతర కీలక రంగాల్లో వారికి పెద్దపీట వేస్తున్నామని సీఎం తెలిపారు. ఇప్పటికే ఎస్సీ ఉప కులాల వర్గీకరణను పూర్తి చేసి విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్‌ను కోరారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అండ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
RevanthReddyTelanganaTelanganaNewsSCCommissionKishorMakwanaSocialJusticeSCWelfareEducationReformsYoungIndiaSchoolsYIIRS
సీఎం రేవంత్ రెడ్డితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ భేటీ - Tholi Paluku