Let's talk: editor@tmv.in
సీఎం రేవంత్‌రెడ్డి ఈవెంట్ మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారు: ఎంపీ ఈటల

సీఎం రేవంత్‌రెడ్డి ఈవెంట్ మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారు: ఎంపీ ఈటల

Gaddamidi Naveen
14 డిసెంబర్, 2025

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు సాధించిన విజయాల నేపథ్యంలో, బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 'ఈవెంట్ మేనేజర్' అంటూ వందల కోట్ల రూపాయల సింగరేణి నిధులను ఫుట్‌బాల్ కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో 11వ తేదీ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మద్దతు పొందిన అభ్యర్థులు ఘన విజయాలు సాధించగా, కమలాపూర్, గుండేడు, గూడూరు గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజా విశ్వాసాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా, బీజేపీ మద్దతు లభించిన ఐదు గ్రామాలు దేశరాజుపల్లి, కానిపర్తి, గోపాలపురం, మాదన్నపేట, నేరెళ్ల,లో కూడా విజయం అందిందని. స్థానిక నాయకుల ప్రజలతో సానుకూల అనుబంధం, వారి కృషి, నాయకత్వ నిబద్ధత ప్రధాన కారణంగా ఈ ఫలితాలు వచ్చాయని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు.

గెలిచిన వారిని కొనుగోలు చేసే చిల్లర ప్రయత్నాలు

ఈ సంద‌ర్భంగా ఎంపీ ఈట‌ల మాట్లాడుతూ, కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు పూర్తిగా స్వతంత్రంగా పోటీ చేయగా, పార్టీలు మద్దతు ఇవ్వలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తమ పార్టీ బలపరిచిన వారిని తమ ఖాతాలో వేసుకునే చిల్లర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈటల ఆరోపించారు.గెలిచిన తర్వాత ఐదు లక్షలు, 10 లక్షలు ఇస్తాం, మా పార్టీకి రండి, మా పార్టీలో గెలిచినట్టు చెప్పుకోండి అని చిల్లర ప్రయత్నం కొనసాగుతోంది.ఎన్నికల ముందే తమకు ఫలానా నాయకుడి ఆశీర్వాదం ఉందని చెప్తే మంచిది కానీ, గెలిచిన తర్వాత అటు ఇటు పార్టీలు మారితే ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదు అని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని, నిధులు వస్తాయని భావన ఉన్నా కూడా, కాంగ్రెస్ పార్టీ 50 శాతం సీట్లు కూడా గెలవలేకపోయింది. దీనిని బట్టి కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఎంత విముఖత ఉందో అర్థం చేసుకోవాలని ఈటల అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి 'ఈవెంట్ మేనేజర్'

రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్ లెక్క మారిపోయారు. మెస్సితో ఫుట్‌బాల్ ఆడుతున్నాడు... సింగరేణిలో క్వార్టర్స్ బాగు చేయడానికి పైసలు లేవు. అప్పు తెచ్చుకుంటే తప్ప జీతాలిచ్చే పరిస్థితి లేదు. కానీ సింగరేణి డబ్బులు 100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకిచ్చి, క్రికెట్ స్టేడియంను మార్చి, వందల కోట్ల రూపాయల సింగరేణి డబ్బులు ఖర్చుపెడుతున్నారు అని ఈట‌ల విమ‌ర్శించారు. సింగరేణి కార్మికుల ఇళ్లు బాగుచేయడానికి డబ్బులు లేవు కానీ, రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోసం వందల కోట్లు ఖర్చుపెట్టడం పట్ల ఉత్తర తెలంగాణ ప్రజలందరూ విసుక్కుంటున్నారు అని ఈటల అన్నారు.

ప్రజా సమస్యలపై విమర్శలు

రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజ్మెంట్ పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని. మెస్సీతో ఫుట్బాల్, క్రీడా మైదానాలు, కోర్టులు, మాచ్చ్ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, కానీ సింగరేణి కార్మికుల ఇళ్లకు, పెన్షన్లకు, గ్యాస్ సబ్సిడీలకు నిధులు అందించడం లేదని, ఈటల పేర్కొన్నారు. భర్త చనిపోయిన మహిళలకు కూడా పెన్షన్ రాలేదని, రైతుబంధు, మహిళలకు 2500 రూపాయల, యువతకు 4000 రూపాయల హామీలు ఇప్పటికీ అమలులో లేవని ఈట‌ల‌ విమర్శించారు.

పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా?

హైదరాబాద్‌లో పేదల ఆస్తులను కూల్చివేయడం, పెద్దల కబ్జాలను పట్టించుకోకపోవడంపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం పెద్దల ఆస్తులను కాపాడే ప్రయత్నాల్లో ఉండకుండా, పేదలకు రక్షణ కల్పించాలి అని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. ఎల్లమ్మ బండ్లలోని 97 ఎకరాల భూముల కబ్జాలపై, సింగరేణి వంటి వివాదాస్పద ప్రాజెక్టులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని, సమస్య పరిష్కారం చేయాలని ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికల్లో డబ్బులు కంటే, నిబద్ధత, నిజాయితీ ఉన్న అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ముందడుగు వేయాలని సూచించారు. కమలాపూర్, గూడూరు గ్రామాల్లో గెలిచినవారిని శిరస్సు వంచి అభినందిస్తూ, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధిలో సపోర్ట్ చేస్తామని ఆయ‌న‌ తెలిపారు.

రాబోయే ఎన్నికల పిలుపు

వీణవంక, హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట నాలుగు మండలాల్లో 17వ తేదీ జరగబోతున్న ఎన్నికల్లో కూడా ఇదే విధంగా కృషి చేసి విజయం సాధించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా లో కొంతమంది పోస్టులు అవగాహన లేని వ్యక్తులు పెట్టే పిచ్చి స్థితిలో ఉంటాయి, కానీ సమయం వచ్చినప్పుడు నిజాయితీ వెలుగులోకి వస్తుందని, ప్రజలు గమనిస్తారని ఆయ‌న‌ చెప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఈవెంట్ మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారు: ఎంపీ ఈటల - Tholi Paluku