Let's talk: editor@tmv.in
సీఎం రేవంత్‌కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలి: కేటీఆర్ సవాల్

సీఎం రేవంత్‌కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలి: కేటీఆర్ సవాల్

Gaddamidi Naveen
12 జులై, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య రాజకీయ పోరు ఉత్కంఠభరితంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) జరిగినా కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందన్న సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ధైర్యముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని, ప్రజాక్షేత్రంలో బలాబలాలు తేల్చుకుందామని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాదని అందరూ అన్నారు, కానీ కేసీఆర్ ఒంటరిగా పోరాడి రాష్ట్రాన్ని సాధించి చూపించారు. రేవంత్ రెడ్డి కేవలం ఎత్తులోనే పొట్టి అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది ఆయనకు బుద్ధి కూడా తక్కువేనని కేటీఆర్ అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, దమ్ముంటే ఇప్పుడు అసెంబ్లీ, బైపోల్స్ లేదా జిల్లా పరిషత్ ఎన్నికలు ప్రకటించు.. తేల్చుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ప్రభుత్వ ఐదేళ్ల కాల పరిమితిలో సగం ముగిసిందని, రాబోయే 18 నెలల్లో ఏం జరుగుతుందనే దానిపై రేవంత్ రెడ్డి సర్వే చేయించుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ సర్వేలతో పాటు మరో మూడు సర్వేలలో పునర్విభజన లేకపోయినా బీఆర్‌ఎస్ 78 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి రాబోతోందని తేలిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో పెరిగే 182 స్థానాల్లో కాంగ్రెస్ 117 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. 2014 నుంచి రాహుల్ గాంధీ మూడు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ కథ ముగిసిపోలేదని, అలాగే బలమైన నాయకుడు కేసీఆర్ ఉన్న బీఆర్‌ఎస్ కూడా ఎప్పటికీ శక్తివంతమైన పార్టీయేనని స్పష్టం చేశారు.

షాబాద్ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో పోక్సో కేసు నిందితుడు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మొత్తం ఆరుగురిని దారుణంగా హతమార్చిన ఉదంతంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘోర సామూహిక హత్యాకాండ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనా వైఫల్యానికి, అసమర్థతకు అద్దం పడుతోందని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రే స్వయంగా హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, మహిళలు, బాలికల భద్రతను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో మహిళల, బాలికల మానప్రాణాలకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోక్సో కేసు నిందితుడికి బెయిల్ లభించిన తర్వాత ఇంతటి ఘోరానికి ఒడిగట్టి ఆరుగురి ప్రాణాలను బలిగొనడంపై కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా క్షీణించాయంటే.. కనీసం ఏదైనా అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధిత కుటుంబాలు భయపడే భయంకర పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు
ShabadTelanganaKTRKTRBRSBRSRevanthReddyCongressGovernmentTelanganaPoliticsWomenSafetyLawAndOrderJusticeForVictimsPOCSOCase
సీఎం రేవంత్‌కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలి: కేటీఆర్ సవాల్ - Tholi Paluku