
సీఎం యోగి వర్సెస్ అఖిలేష్
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ కేసుపై సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
వారు విదేశాలకు వెళ్లిపోతారు
అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ దేశంలో రెండు నమూనాలున్నాయి. ఒకరు ఢిల్లీలో కూర్చుంటారు, మరొకరు లక్నోలో కూర్చుంటారు. దేశంలో ఏ అంశంపై నైనా చర్చ మొదలైనా వెంటనే విదేశాలకు వెళ్లిపోతారు. ఇప్పుడు మీ ‘బాబువా’ కూడా మళ్లీ ఇంగ్లండ్‌కు వెళ్లిపోతారు. మీరు ఇక్కడ అరుస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి.
విభేదాలు ఇంత దూరం వెళ్తాయని ఊహించలేదు: అఖిలేష్ యాదవ్
యోగి వ్యాఖ్యలపై స్పందించిన అఖిలేష్ యాదవ్, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేస్తూ ఢిల్లీ–లక్నో మధ్య ఉన్న విభేదాలు ఇంత దూరం వెళ్తాయని ఎవరూ ఊహించలేదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు కనీసం ప్రజా మర్యాదను పాటించాలి. బీజేపీ నాయకులు తమ పార్టీ అంతర్గత గొడవలను ప్రజల మధ్యకు తీసుకురావద్దు. ఎక్కడైనా ఎవరికైనా అభ్యంతరం కలిగితే, వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.
కోడైన్ దగ్గు సిరప్ కేసుపై సీఎం స్పష్టీకరణ
ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ కేసుపై సమగ్ర వివరణ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో కోడైన్ దగ్గు సిరప్ వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని, ఈ కేసును పూర్తిగా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్డీపీఎస్) చట్టం కింద విచారిస్తున్నామని, ఈ కేసును ఎన్డీపీఎస్ చట్టం కిందనే విచారించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.
ఇప్పటివరకు తీసుకున్న చర్యలు
కేసులో ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై సీఎం వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మొత్తం 79 కేసులు నమోదు చేశామని, 225 మందిని నిందితులుగా గుర్తించి, 78 మందిని అరెస్ట్ చేశాం. 134 సంస్థలపై దాడులు (రైడ్స్) నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాక, ఈ కేసులో తొలుత అరెస్టైన రాష్ట్రంలో అతిపెద్ద హోల్‌సేలర్‌కు 2016లో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందని యోగి ఆరోపించారు.
ఎస్పీకి లింకులు బయటపడతాయి
విచారణ లోతుగా కొనసాగితే సమాజ్‌వాదీ పార్టీకి సంబంధించిన నాయకులు లేదా వ్యక్తుల ప్రమేయం బయటపడే అవకాశముందని సీఎం యోగి ఆరోపించారు. ఈ కేసును మరింత లోతుగా పరిశీలిస్తే చివరికి ఎస్పీకి సంబంధించిన వ్యక్తి లేదా నాయకుడి పేరు బయటపడుతుంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేసి గెలిచిందని తెలిపారు. ఈ వ్యవహారంలో ఉన్న వారిపై ఎలాంటి మినహాయింపులు ఉండవని సీఎం స్పష్టం చేశారు. ఈ కేసులో ఎవరూ తప్పించుకోలేరు. అవసరమైతే బుల్డోజర్ చర్యలకు కూడా సిద్ధంగా ఉండాలి. ఆ సమయంలో ఫిర్యాదులు చేయవద్దు అంటూ ఘాటు హెచ్చరిక జారీ చేశారు.
