
సీఎం మార్పులో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్: సీఎం సిద్దరామయ్య
కర్ణాటకలో సీఎం మార్పు గురించి ఊహగానాలకు పుల్ స్టాప్ పడటం లేదు. ఈ మధ్య ఇదే విషయంపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రులు, సీఎం సిద్ధరామయ్య కొడుకు తదితరులు ఈ అంశంపైనే మాట్లాడడంతో మరింతగా పుకార్లు పెరిగిపోయాయి. సోమవారం ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు.పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికలు పూర్తయిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చిస్తామని తెలిపారు.ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నా, హైకమాండ్ నిర్ణయమే ఫైనల్. ఇప్పటి వరకు హైకమాండ్ ఎటువంటి సూచన ఇవ్వలేదు. బీహార్ ఎన్నికల అనంతరం ఈ విషయంపై చర్చిస్తాం అని చెప్పారు. ఈ సందర్భంగా బీహార్ ఎన్నికల ప్రచారానికి పిలుపు వస్తే తప్పక వెళ్తానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఈ సారి బీహార్ ఎన్నికల్లో మహఘట్బంధన్ కూటమి విజయం సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. బీహార్‌లోని ఎన్డీయే కూడా కర్ణాటకలో అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలను కాపీ కొడుతోంది. మా రాష్ట్రంలో 1.24 కోట్ల మహిళలకు ప్రతి నెల రూ.2000 చొప్పున ‘గృహలక్ష్మీ’ పథకం కింద అందిస్తున్నాం. ఇప్పటి వరకు రూ. లక్ష కోట్లకు పైగా గ్యారంటీ పథకాల అమలు కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. నితీశ్ కుమార్ తరచుగా వివిధ పార్టీలతో కూటములు కడుతున్నారు. ఆయనకు ఎలాంటి సూత్రాలు, సిద్ధాంతాలు లేవు. బీహార్‌లో పేదరికం ఇంకా తొలగిపోలేదు. అందువల్ల పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారని నమ్మకం ఉందన్నారు. అలాగే సీఎం మార్పు అంశంపై కూడా స్పందించారు.
సీఎం పదవి ఖాళీగా లేదు
ఇటీవల కర్ణాటక మంత్రి బైరతి సురేష్ మంత్రివర్గంలో నాయకత్వ మార్పు పుకార్లను తోసిపుచ్చారు. రాష్ట్రంలో సీఎం పదవి ఖాళీగా లేదని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర పరిపాలనను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని పునరుద్ఘాటించారు. ఈ మార్పులన్నీ ఊహాగానాలే,”
అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న గురించి అడిగినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ ఏ పదవినైనా అడిగే హక్కు ఉంది. దళితుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, నేను అందరం కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికులం. ఏదైనా అంశంపై తుది నిర్ణయం మా సమర్థవంతమైన హైకమాండ్ తీసుకుంటుంది అని ఆయన స్పష్టం చేశారు. సీఎం చెప్పినదే తుది మాట. ఆయన మాటే మాకు మార్గదర్శనం అని డీసీఎం డీకే శివకుమార్ కూడా తెలిపారు. హోం మంత్రి జి. పరమేశ్వర మాట్లాడుతూ నాయకత్వ మార్పు, కేబినెట్ విస్తరణపై వస్తున్న వ్యాఖ్యలు అంతా నిరర్థకం. తుది నిర్ణయం హైకమాండ్‌దేనన్నారు.
రాజకీయ కారణాలు
సీఎం మార్పు అనే మాట రాష్ట్రంలో పదేపదే ఎందుకు వస్తోంది. దానిపై సిద్దరామయ్య ఎందుకు మాట్లాడారు. అనేది రాజకీయ కోణంలో చూడాల్సిన విషయం. 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో సిద్దరామయ్య–డీకే శివకుమార్ మధ్య ఒక “కాల పరిమితి ఒప్పందం” ఉందని పలువురు నేతలు అప్పట్లో చెప్పారు. అంటే సగం కాలం సీఎంగా సిద్దరామయ్య, మిగతా శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండొచ్చని ఊహాగానాలు చేశారు. ఈ కాలం ముంచుకొస్తున్నందున, ఇప్పుడు ఆ ఒప్పందం గురించి మళ్లీ చర్చ మొదలైంది. అలాగే కొంతమంది దళిత నాయకులు ‘దళిత సీఎం’ అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. ఇది కాంగ్రెస్‌లో అధికార సమతుల్యతను కాపాడే వ్యూహం కూడా కావచ్చు. దాంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు సిద్దరామయ్య వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారని పత్రికలలో వార్తలు వస్తున్నాయి. హైకమాండ్ దృష్టికి ఈ విషయం కూడా చేరింది.
