
సీఎం మార్పుపై ఎలాంటి ఊహగానాలు లేవు: డీకే శివకుమార్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య–ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నాయకత్వ మార్పు అంశంపై ఎలాంటి అయోమయం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలోనే చర్చ జరిగిందని, ఇతర నాయకులు అనవసర వ్యాఖ్యలు చేయడం పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. మంగళవారం డీకే శివకుమార్ బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, సీఎం మార్పుపై పార్టీలో నెలకొన్న చర్చలపై స్పందించారు. సీఎం మార్పు అంశంపై ఎటువంటి ఊహగానాలు లేవు. పార్టీలోని నాయకులకు కొంత అయోమయం ఉండొచ్చు, కానీ నాకు మాత్రం పూర్తి క్లారిటీ ఉందని తేల్చిచెప్పారు. సీఎం సిద్ధరామయ్య తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేస్తారని ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య ఇటీవల వ్యాఖ్యానించడంతో మళ్లీ కాంగ్రెస్‌లో అధికారం పంచుకునే ఒప్పందం (పవర్ షేరింగ్) అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో శివకుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
హైకమాండ్ తోనే చర్చించాం
సిద్ధరామయ్యతో నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు. అది రహస్యంగా కాదు. పార్టీ హైకమాండ్ సమక్షంలోనే చర్చలు జరిగాయి. ఇతరులు ఉద్రిక్తతకు లోనై ప్రకటనలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదని శివకుమార్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అన్ని ఊహగానాలకు ఫుల్ స్టాప్ పెట్టి అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించండి అని చెప్పారు. ఆయన మాటలను అందరూ పాటించాలని స్పష్టం చేశారు. తనకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎవరైనా ప్రకటనలు చేసినా అవి పార్టీకి నష్టం చేస్తాయని ఆయన హెచ్చరించారు. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా ఎవరు మాట్లాడినా పార్టీనే దెబ్బతీస్తున్నారని అన్నారు. నాయకత్వ అంశంపై వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్‌కు నోటీసు ఇవ్వగా, యతీంద్ర సిద్ధరామయ్యకు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నపై స్పందించిన శివకుమార్ ఆ విషయం హైకమాండ్‌ను అడగాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2025 నవంబర్ 20న ఐదేళ్ల పాలనలో సగం కాలాన్ని పూర్తి చేయడంతో సీఎం మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2023లో ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో సిద్ధరామయ్య–శివకుమార్ మధ్య అధికారం పంచుకునే ఒప్పందం జరిగినట్టు వచ్చిన కథనాలే ఈ ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి.
ప్రీ–బడ్జెట్ సమావేశాలకు హాజరుకాలేను
అస్సాం ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ ఆబ్జర్వర్‌గా నియమితులైన శివకుమార్, ఢిల్లీ పర్యటనపై కూడా స్పందించారు. ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ సమావేశం ఉంది. ఎన్నికల తేదీలు ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. కేరళకు వెళ్లాను, ఇప్పుడు అస్సాంకు వెళ్లాల్సి ఉందని తెలిపారు. సీఎం నిర్వహిస్తున్న ప్రీ–బడ్జెట్ సమావేశాలకు తాను హాజరుకాలేకపోవడంపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ, సీఎం అనుమతి తీసుకున్నాను. నా శాఖలపై అధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించాను. అధికారులు సీఎం సమావేశాలకు హాజరవుతారు. తిరిగి వచ్చాక సీఎంతో చర్చిస్తానని చెప్పారు. ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం సిద్ధరామయ్య పలు శాఖలతో ప్రీ–బడ్జెట్ సమావేశాలు కొనసాగిస్తున్నారు. 2026–27 బడ్జెట్ మార్చిలో ప్రవేశపెట్టే అవకాశం ఉండగా, ఇది సిద్ధరామయ్యకు 17వ బడ్జెట్ కావడం విశేషం. ఢిల్లీ పర్యటనలో హైకమాండ్ నేతలను కలుస్తారా అన్న ప్రశ్నకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందరూ అందుబాటులో ఉంటే కలుస్తాను అని తెలిపారు. తాను ఢిల్లీ నుంచి ‘గుడ్ న్యూస్’ తీసుకువస్తానని కొందరు ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారన్న ప్రశ్నకు, ప్రతి రోజూ నాకు మంచి రోజే. ప్రతి రోజు ఒక కొత్త ఆరంభం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కష్టాలు, విమర్శలు ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని శివకుమార్ వ్యాఖ్యానించారు.
