Let's talk: editor@tmv.in
సీఎం మహిళా రోజ్‌గార్‌ యోజన

సీఎం మహిళా రోజ్‌గార్‌ యోజన

Pinjari Chand
28 సెప్టెంబర్, 2025

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీహార్ లో సంక్షేమ పథకాల ప్రకటన, నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే కేంద్రం రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా అనేక పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్ట్​ ​లను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. ‘సీఎం మహిళా రోజ్​ గార్​ యోజన’ పేరుతో ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఎన్నికల తరుణంలో ఈ పథకం ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడానికి సహాయపడుతుందా? విజయఢంకా మోగించడానికి ఉపయోగపడుతుందా కాలమే నిర్ణయిస్తుంది. ఎన్నికల షెడ్యూల్​ వెలువడడానికి కొద్ది రోజుల ముందు పథకాన్ని ప్రారంభించడానికి గల కారణాలపైనే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

75 లక్షల మందికి రూ.7500 కోట్లు

మహిళల స్వయం ఉపాధి కోసం రాష్ర్టంలో సుమారు 75 లక్షల మంది మహిళలకు కుటుంబంలో ఒకరికి రూ.10,000 నగదును వారి బ్యాంక్​ ఖాతాల్లోకి బదిలీ చేశారు. మొత్తంగా రూ.7500 కోట్లను వారికి అందజేశారు. శుక్రవారం ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయం ఉపాధి పొందడానికి రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం అందజేస్తుందని, మొదటి విడతగా పదివేలు జమ చేశామన్నారు. స్వశక్తితో, ఆర్థికంగా ఎదగడానికి ఈ డబ్బులను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఒకేసారి ఇంత పెద్ద స్థాయిలో మహిళలకు నగదు బదిలీ చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

మహిళ ఓటర్లే లక్ష్యమా?

బీహార్​ లో 2023లో నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం దాదాపు 13 కోట్ల జనాభా ఉంది. అందులో సుమారు 7 కోట్ల 70 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. జనాభాలో సగానికి పైగా ఓటర్లు ఉన్నారు. అందులో 3.72 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. వీరి ఓట్లే ఎన్నికల్లో లక్ష్యంగా పథకం ప్రారంభించి ప్రతిపక్షాలకు ప్రధాని మోడీ మాస్టర్​ స్ట్రోక్ ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల ముందు ప్రకటించే పథకాలు ఓట్లు రాలుస్తాయా అన్న భిన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. గతంలో నితీశ్​ కుమార్​ కన్యా సురక్షా యోజన, సైకిల్​ యోజన వంటి పథకాలు మహిళా ఓటర్లను చాలా వరకు ప్రభావితం చేశాయి.

సైకిల్ యోజన

బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి, డ్రాపౌట్స్​ తగ్గించడానికి సీఎం నితీశ్​ కుమార్ 2006 లో ప్రారంభించారు. 9 వ తరగతి చదువుతున్న బాలికలకు ఈ పథకం కింద సైకిల్ ను అందించడం ఈ పథకం ఉద్దేశం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా విద్యాశాతం పెరిగింది. దాదాపు 30 నుంచి 40 శాతం వరకు పాఠశాలల్లో చదువుకునే బాలికల సంఖ్య పెరిగింది. దీంతో ఈ పథకాన్ని బాలురకు కూడా అనుసంధానించారు. దూరం ఉంది, ప్రయాణ సౌకర్యాలు లేవు అనే కారణంతో బడికి వెళ్లడం మానివేయకుండా ప్రారంభించిన ఈ పథకం అద్భుతమైన విజయం సాధించింది. 2010లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ అప్రతిహతంగా దూసుకెళ్లడానికి సహయపడింది. 243 అసెంబ్లీ స్థానాల్లో 115 గెలుచుకుంది. 2005 ఎన్నికల్లో సాధించిన స్థానాలు 55 కంటే రెండు రెట్లు అధికంగా సీట్లను సాధించింది. దీంతో మరోసారి నితీశ్ బీజేపీతో కలిసి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తదనంతర ఎన్నికలలో మహిళలే జేడీయూకు మద్దతు పలుకుతూ వస్తున్నారు. అలాగే కన్యాసురక్షా యోజన పథకం కూడా జేడీయూ గెలుపులో కీరోల్ పోషించింది.

కన్యా సురక్షా యోజన

అడపిల్ల పుడితే బాధపడకుండా, పురిట్లోనే చంపేయకుండా, భ్రూణ హత్యలు నివారించడానికి 2007లో నితీశ్​ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఆడపిల్లకు జన్మనిచ్చిన వారికి రూ.2000 అందజేసింది. ఈ పథకం కూడా మహిళలో జేడీయూ పట్ల సానుకూల దృక్ఫథకానికి కారణమైంది. ఈ పథకాలను బట్టి, ఫలితాలను పోల్చి చూస్తే ప్రతి సారి ఎన్నికల్లో మహిళలు జేడీయూను అదరిస్తూ వస్తున్నారన్నది స్పష్టం అవుతుంది.

ప్రస్తుత సీఎం మహిళా రోజ్ గార్​ యోజన అన్నది నేరుగా మహిళలకు లబ్ధి చేకూర్చుతుంది. అలాగే దళిత, పేదరిక వర్గాలకు చెందిన మహిళలు, స్వయం సహాయక సంఘాల్లో ఉండే మహిళలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగించనుంది. అదనంగా ఓటు బ్యాంక్​ ను పొందే ఆస్కారం ఉంది. అయితే ఈ పథకం అమలు సక్రమంగా జరిగితేనే ప్రతిఫలం దక్కుతుంది. కానీ అమలులో అవినీతి, ఆలస్యం, లబ్ధిదారుల ఎంపిక, పార్టీ ప్రతీకి అవకాశమిస్తే మొదట్లోనే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.

2025 లో జరగబోయే ఎన్నికల పరిస్థితులు జేడీయూకు, ముఖ్యంగా ఎన్డీయేకు అనుకూలంగా లేవు. రాష్ట్రంలో ఓటర్ల సవరణ పేరుతో 65 లక్షల ఓటర్లను తొలగించారన్న ఆరోపణలు, దేశవ్యాప్తంగా ఓట్​ చోరీ పై ఉదృతమైన ఆందోళనలు, నేటికీ వేధిస్తున్ననిరుద్యోగం, మత విద్వేషాలు, మౌలిక సదుపాయాల కొరత, గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నేటికి అమలు కాకపోవడం, తదితర సమస్యల నేపథ్యంలో ఎంతమేరకు మహిళా ముఖ్యమంత్రి రోజ్​ గార్​ యోజన రానున్న ఎన్నికల్లో గేమ్​ చేంజర్​ అవుతుందన్నది నవంబర్​ వరకు వేచి చూడాల్సిందే.

​ ​

సీఎం మహిళా రోజ్‌గార్‌ యోజన - Tholi Paluku