
సీఎం మమతపై ఎంపీ బన్సూరీ స్వరాజ్ విమర్శలు
దుర్గాపూర్ సంఘటనపై ఆదివారం పశ్చిమ బెంగాల్ సీఎం మాట్లాడిన తీరుపై బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశమంతా ఈ దారుణంపై విచారంలో ఉంటే, ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఆడపిల్లలు రాత్రి సమయంలో బయటకు వెళ్లకూడదని మాట్లాడటం సరైంది కాదన్నారు. ఒక వైద్య విద్యార్థిని పై అత్యాచారం జరిగితే టీఎంసీ వ్యవహరిస్తున్న తీరు మానసిక తిరోగమనాన్ని సూచిస్తుందన్నారు. వారు ఈ ఘటనను సమర్థిస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. అలాగే మీరు సీఎం మాత్రమే కాదు. ఆ రాష్ట్ర హోం మినిస్టర్ గా కూడా ఉన్నారు. బాధితులకు న్యాయం చేసే బదులు వారిపైనే విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. దుర్గామాత కొలువై ఉన్నా ప్రదేశంలో మహిళలకే భద్రత లేకపోవడం శోచనీయం. ఎప్పుడైనా మహిళలు బయట సురక్షితంగా తిరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.
అదేవిధంగా సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి మోహమ్మద్ సలీమ్ కూడా మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. పురుషులు, మహిళలు సమానమన్న విషయాన్ని సీఎం మమతా బెనర్జీ అంగీకరిస్తారా? లేదా. రాత్రి సమయంలో మహిళలు బయటకు రావద్దంటున్నారు. మరీ మగవాళ్లకు కూడా ఇదేవిధంగా చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. బెంగాల్ లో ఏ మహిళకు భద్రత లేదని వాపోయారు. రాష్ర్టంలో శాంతిభద్రతలు నాశనమయ్యాయని ప్రభుత్వాన్ని సలీం విమర్శించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, మహిళల సాధికారత కోసం పని చేసిన రాజా రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటి నాయకుల ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. ఆమె మహిళా ముఖ్యమంత్రి అయినా మహిళల స్వేచ్ఛను పరిమితం చేస్తున్నారని, ఇదేమన్న తాలిబన్ పాలనా? అని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో నేరగాళ్లకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందన్నారు. అయితే ఈకేసులో ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు.
