
సీఎం పెట్టిన మొదటి సంతకం ఫైల్ ఏమైంది?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల చట్టబద్ధతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరు గ్యారంటీల చట్టబద్ధత కోసం చేసిన 'మొదటి సంతకంస ఫైల్ ఏమైందని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన ఆరు హామీలకు చట్టబద్ధత కల్పించేందుకు మొదటి సంతకం చేసినట్లు ప్రకటించిన ఫైల్ ఎక్కడ ఉందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, అధికారాలు శాశ్వతం కావని గుర్తుచేశారు. మేము కూడా పదేళ్లు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నాం. కానీ పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం విశ్వసనీయతకు ప్రతీకలు కావాలని ఆయన అన్నారు. 2023 డిసెంబర్ 15న జరిగిన గవర్నర్ ప్రసంగాన్ని గుర్తు చేస్తూ, అప్పటి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సభలోనే ఆరు హామీలకు చట్టబద్ధత ఇస్తామని ప్రకటించారని చెప్పారు.
ఆ ప్రసంగంలో ముఖ్యమంత్రి మొదటి సంతకం ఆ హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్‌పైనే చేశారని పేర్కొన్నారని కేటీఆర్ తెలిపారు. అయితే ఇప్పుడు ఆ ఫైల్ పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. ఆ సంకల్పం ఎక్కడికి పోయింది? ఆ సంతకం ఎక్కడుంది? ఆ నిజాయితీ ఏమైంది? అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇంకా, 2024 గవర్నర్ ప్రసంగం తర్వాత 2025, ఇప్పుడు 2026 కూడా పూర్తవుతున్నప్పటికీ ఆ ఫైల్ గురించి సమాచారం లేదని విమర్శించారు. 28 నెలలుగా ఆ ఫైల్ ఎక్కడికి పోయింది? ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? అని సందేహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ హామీ ఏమైంది?
కేవలం గవర్నర్ మాత్రమే కాకుండా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలపై చట్టపరమైన హామీ ఇస్తామని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటివరకు దాదాపు 50 నుంచి 60 క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. మరి చట్టబద్ధత హామీ ఏమైంది? ప్రజలను, గవర్నర్‌ను, ఈ పవిత్రమైన సభను వంచించారు అని ఆయన ఆరోపించారు.
'సిట్' వేయాలని డిమాండ్
మాయమైన ఆ ఫైలును వెతికి పట్టుకోవడానికి ప్రభుత్వం వెంటనే ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మొదటి ప్రసంగానికే విలువ లేకపోతే, ఇప్పుడు చేస్తున్న మూడవ ప్రసంగానికి ఏం విలువ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. రెండున్నరేళ్లు గడిచినా ఒక్క హామీకి కూడా చట్టబద్ధత కల్పించలేదని, బడ్జెట్ సమావేశాల సాక్షిగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చే వరకు తాము వదిలిపెట్టబోమని కేటీఆర్ పేర్కొన్నారు.
