Let's talk: editor@tmv.in
సీఎం నిజమైన స్నేహితులు లంచం, అవినీతే: టీవీకే విజయ్

సీఎం నిజమైన స్నేహితులు లంచం, అవినీతే: టీవీకే విజయ్

Pinjari Chand
24 ఫిబ్రవరి, 2026

నటుడు, తమిళ వెట్రి కళగం(టీవీకే) నాయకుడు విజయ్ డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం నకిలీ మోడల్ ప్రభుత్వమని, స్టాండ్-అప్ కామెడీ ప్రభుత్వంగా పనిచేస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వెల్లూరులో జరిగిన ప్రజాసభలో మాట్లాడిన విజయ్, రాష్ట్ర రాజకీయ పోరు టీవీకే డీఎంకే మధ్యనే జరుగుతుందన్నారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ విజయ్, స్టాలిన్ సార్ మధ్యే. తమిళనాడు అంటే విజయ్, విజయ్ అంటే తమిళనాడని అన్నారు. ఈ సందర్భంగా అస్సాం మాజీ ముఖ్యమంత్రి డీకే బరువా చేసిన ‘ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా’ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ వారసత్వాన్ని కొనియాడుతూ చేసినవని గుర్తుచేశారు.

‘నకిలీ హామీలు’ – స్టాలిన్‌పై ఆరోపణలు

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రజలకు తప్పుడు హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం నకిలీ మోడల్‌తో నడుస్తోంది. ఇది చారిత్రాత్మక ఎన్నిక. అద్భుత ఎన్నిక అవుతుందని అన్నారు. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లా తిరిగి ప్రజలను వ్యక్తిగతంగా కలుస్తానని హామీ ఇచ్చారు. మన ఓటు, మన హక్కు. ఎవరూ దాన్ని లాక్కోలేరు. విజిల్ గుర్తుకు ఓటేయండని ప్రజలకు పిలుపునిచ్చారు.

సీఎం స్టాలిన్‌ ఆస్తులను ప్రకటించాలి

సీఎం స్టాలిన్‌కు నిజమైన స్నేహితులు లంచం, అవినీతి, రాజకీయ లాభాలపై కన్నేయడం అని ఆరోపించారు. స్టాలిన్ రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. ఆ డబ్బు మీ కష్టార్జితమా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదించిందేనా? బహిరంగంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తే అవినీతి శక్తులు తమపై బురదజల్లుతాయని అన్నారు. అయితే ప్రజలకు తన గురించి స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు.

‘సూపర్ స్టార్ స్టేట్’ వాదనపై విమర్శ

డీఎంకే ప్రభుత్వం తమిళనాడును సూపర్ స్టార్ రాష్ట్రంగా అభివృద్ధి చేశామని చెబుతోందని, ఆ వాదనను విజయ్ ఖండించారు. ప్రఖ్యాత నాయకులు కామరాజ్, అన్నాదురై, ఎం.జి. రామచంద్రన్ కాలంలోనే తమిళనాడు నిజంగా అద్భుత రాష్ట్రంగా ఉన్నదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉల్టా మోడల్ ప్రభుత్వంగా అభివర్ణిస్తూ స్టాండ్-అప్ కామెడీ ప్రభుత్వంగా మారిందని వ్యంగ్యంగా విమర్శించారు.

విజయ్ వర్సెస్ స్టాలిన్

ఏప్రిల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఆశ్చర్యకరమైన ఎన్నికలుగా అభివర్ణించిన విజయ్, రాష్ట్రంలోని అన్ని పార్టీలు తనకు వ్యతిరేకంగా ఏకమయ్యాయని ఆరోపించారు. అయినప్పటికీ పోటీ కేవలం డీఎంకే, టీవీకే మధ్యేనని అన్నారు. స్టాలిన్ తనకు రాజకీయాల్లో శత్రువుల్లేరని అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ అయితే కరూర్ తొక్కిసలాటకు నన్నెందుకు నిందిస్తున్నారు? అని ప్రశ్నించారు. టీవీకే సభలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించి, తర్వాత కరూర్ విషాదానికి తమపై మోపారని ఆరోపించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను వ్యక్తిగతంగా కలుస్తానని హామీ ఇచ్చారు. ఎవరూ మనల్ని కొనలేరు. మనం మోసపోం. మాట తప్పం అంటూ పార్టీ కార్యకర్తలతో ప్రమాణం చేయించారు.