
సీఎం చంద్రబాబుతో బీసీ సంఘాల భేటీ
రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధికి వారి సామాజిక భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం నేతలు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీల స్థితిగతులు వారి డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, జాతీయ అధ్యక్షుడు జే. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించింది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కల్పనపై కేంద్రంతో చర్చించాలని, అదేవిధంగా బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని త్వరితగతిన తీసుకురావాలని వారు కోరారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు చొరవ చూపాలని విన్నవించారు. అదేవిధంగా ఓబీసీ సబ్ ప్లాన్ ద్వారా ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నేతలు ఈ సందర్భంగా కోరారు.
బీసీ నేతల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి. కేంద్ర పరిధిలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర స్థాయిలో బీసీలకు పూర్తి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బీసీల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని మున్ముందు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీఎం వివరించారు.
అనంతరం బీసీ సంఘం నేతలు మాట్లాడుతూ బీసీల అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. చేనేతలకు ఉచిత విద్యుత్, మత్స్యకారులకు వేట నిషేధ భృతి, వివాదాస్పద 217 జీవో రద్దు వంటి నిర్ణయాలు బీసీ వర్గాల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయని కొనియాడారు. కల్లు గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు, వడ్డెరలకు మైనింగ్‌లో ప్రాధాన్యత కల్పించడం ద్వారా ప్రభుత్వం తమ పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకుందని వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
