Let's talk: editor@tmv.in
సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ

సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ

Panthagani Anusha
17 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు. ఉభయ రాష్ట్రాల మధ్య సమన్వయం, సరిహద్దు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, ఇతర ద్వైపాక్షిక అంశాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం పెరిగితేనే ఇరు రాష్ట్రాల ప్రజలకు గరిష్ట లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా తుమ్మల అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసేలా సహకరించాలని మంత్రి తుమ్మల ముఖ్యమంత్రిని కోరారు. వీటితో పాటు శ్రీవారి దర్శనార్థం వెళ్లే తెలంగాణ భక్తుల సౌకర్యార్థం తిరుమలలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని విన్నవించారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో టీటీడీ దేవస్థాన నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలని కోరారు.

సాగునీరు, రైల్వే లైన్లపై వినతి

ఖమ్మం జిల్లా పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మతుల విషయం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ పనులకు అయ్యే ఖర్చులో 85 శాతం నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేయాలని తుమ్మల అభ్యర్థించారు. రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-అమరావతి రైల్వే లైన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు.

అదేవిధంగా భద్రాచలం పట్టణాన్ని వరద ముంపు నుంచి రక్షించేందుకు నిర్మించిన ఆయకట్టుకు సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి కోరారు. సరిహద్దు ప్రాంతాల్లోని రోడ్లు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలు ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరపడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. అయితే మంత్రి చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ - Tholi Paluku