Let's talk: editor@tmv.in
సీఎం చంద్రబాబుకు “బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు

సీఎం చంద్రబాబుకు “బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు

Panthagani Anusha
19 డిసెంబర్, 2025

దేశంలోని ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్టాత్మకంగా అందించే ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలకు ఊతం ఇవ్వడం, పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించడంలో సాధించిన ఫలితాలకు గానూ ఈ గౌరవాన్ని ప్రకటించినట్లు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.

కాగా మార్చి నెలలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఈ ఎంపికను చేసింది.

ఈసారి జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. జ్యూరీకి డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరించింది.

ఈ అవార్డును గతంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ (2024), ఎస్. జైశంకర్ (2023), నిర్మలా సీతారామన్ (2021), మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్ (2019), కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (2017), పీయూష్ గోయల్ (2015) తదితరులు అందుకున్నారు.

మరోవైపు ప్రతిష్టాత్మక అవార్డు దక్కిన సందర్భంగా పలువురు ప్రముఖులు, మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే దిశగా ఆయన చర్యలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు.

సీఎం చంద్రబాబుకు “బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు - Tholi Paluku