
సీఎం ఎక్స్అఫిషియో స్పెషల్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్
ముఖ్యమంత్రి ఎక్స్-అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. విజయానంద్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సిఎస్) గత నెల 28వ తేదీన పదవీ విరమణ చేసిన ఆయనను ముఖ్యమంత్రికి అత్యంత కీలకమైన విభాగంలో ఎక్స్-అఫిషియో హోదాలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా వ్యవహారాల్లో ఆయనకున్న అపార అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.
కాగా సోమవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలోని మొదటి భవనంలో విజయానంద్ తన నూతన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం,తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన అధికారిక దస్త్రాలపై సంతకం చేశారు. ఆలయ మర్యాదలతో పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి శుభం కలగాలని ఆకాంక్షించారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం సచివాలయానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు విజయానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శాఖల కార్యదర్శులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో (సిఎంఓ) కీలకమైన ఎక్స్-అఫిషియో బాధ్యతలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతలను అభివృద్ధి పథకాలను మరింత వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర కీలకం కానుంది.
