Let's talk: editor@tmv.in
సీఎం అనుమ‌తితో త్వ‌ర‌లోనే విద్యుత్ శాఖ‌లో నియామ‌కాలు:

సీఎం అనుమ‌తితో త్వ‌ర‌లోనే విద్యుత్ శాఖ‌లో నియామ‌కాలు:

Panthagani Anusha
27 ఫిబ్రవరి, 2026

రాష్ట్ర శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖలో కీలక నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. గురువారం శాసనమండలిలో సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా, మెయింటెనెన్స్ పనుల కోసం దాదాపు 18,000 మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది సేవలు అందిస్తున్నారని భవిష్యత్తులో అసిస్టెంట్ ఇంజనీర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేస్తామని అదేవిదంగా లైన్ మెన్ల భర్తీపై కూడా ప్రభుత్వం సరైన సమయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాలో సిబ్బంది పాత్ర కీలకమని అందుకే ఖాళీలను భర్తీ చేసి వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

మరోవైపు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 5,580 మంది ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖలో సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. విశాఖపట్నంలోని 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్' ద్వారా వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. వీరు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే శాఖలోని 77 శాతం పైగా ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉందని దీనివల్ల క్షేత్రస్థాయిలో వినియోగదారుల సమస్యలు తక్షణమే పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8,000 కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనులు చేపట్టినట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు. వ్యవసాయ ఫీడర్లను వేరు చేయడం ద్వారా గ్రామాల్లో వోల్టేజ్ స్థిరత్వం పెరగడమే కాకుండా ఎటువంటి అంతరాయాలు లేని విద్యుత్ అందుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా తుపానుల సమయంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినకుండా విశాఖపట్నం వంటి తీర ప్రాంతాల్లో భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.