
సీఈ–20 క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. తమిళనాడులో సీఈ–20 క్రయోజెనిక్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన సందర్భంగా ఆయన ఈ అభినందనలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో జితేంద్ర సింగ్ ‘తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 22 టన్నుల త్రస్ట్ సామర్థ్యంతో సీఈ–20 క్రయోజెనిక్ ఇంజిన్‌ను సముద్ర మట్టం వద్ద విజయవంతంగా ‘హాట్ టెస్ట్’ నిర్వహించినందుకు ఇస్రోకు అభినందనలు. నాజిల్ ప్రొటెక్షన్ సిస్టమ్, మల్టీ ఎలిమెంట్ ఇగ్నైటర్‌తో నిర్వహించిన ఈ పరీక్ష భారతదేశం క్రయోజెనిక్ ప్రొపల్షన్ సామర్థ్యాన్ని మరింత బలపరుస్తుంది. అలాగే ఎల్‌వీఎం3 లాంచ్ వెహికిల్ విశ్వసనీయతను కూడా పెంచుతుంది’ అని పేర్కొన్నారు. ఇస్రో మార్చి 10న మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో సీఈ–20 క్రయోజెనిక్ ఇంజిన్‌పై సముద్ర మట్టం వద్ద 22 టన్నుల త్రస్ట్‌తో హాట్ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది. నాజిల్ ప్రొటెక్షన్ సిస్టమ్, మల్టీ ఎలిమెంట్ ఇగ్నైటర్‌ను ఉపయోగించి ఈ పరీక్ష చేపట్టారు.
ఇంతకుముందు ఇదే నాజిల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌తో సముద్ర మట్టం వద్ద పరీక్షలను 19 టన్నుల త్రస్ట్ స్థాయిలో నిర్వహించారు. సీఈ–20 క్రయోజెనిక్ ఇంజిన్ ఎల్‌వీఎం3 లాంచ్ వెహికిల్ పైభాగంలోని క్రయోజెనిక్ దశకు శక్తినిస్తుంది. ఎల్వీఎం–3 రాకెట్ పేలోడ్ సామర్థ్యాన్ని పెంచేందుకు భవిష్యత్ మిషన్లలో 22 టన్నుల త్రస్ట్‌తో పనిచేసే అప్‌గ్రేడ్ చేసిన సీ–32 దశను వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఈ–20 ఇంజిన్‌ను 165 సెకన్లపాటు 22 టన్నుల త్రస్ట్‌తో సముద్ర మట్టం వద్ద విజయవంతంగా పరీక్షించారు. అయితే సముద్ర మట్టం వద్ద ఈ ఇంజిన్‌ను పరీక్షించడం సవాలుతో కూడుకున్నదని ఇస్రో తెలిపింది. ముఖ్యంగా నాజిల్‌లో ప్రవాహం విభజన (ఫ్లో సెపరేషన్) జరిగితే తీవ్ర కంపనలు, ఉష్ణ సమస్యలు ఏర్పడి నాజిల్‌కు నష్టం కలిగే ప్రమాదం ఉండటంతో ఈ పరీక్షలు అత్యంత జాగ్రత్తలతో నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించింది.
అంతరిక్ష రంగంలో భారత్‌కు చేకూరనున్న బలం
ఇస్రో నిర్వహించిన సీఈ–20 క్రయోజెనిక్ ఇంజిన్ విజయవంతమైన పరీక్ష భారత అంతరిక్ష కార్యక్రమానికి కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు. ఈ పరీక్షతో భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల్లో పలు ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా ఈ ఇంజిన్‌ను ఉపయోగించే ఎల్‌వీఎం3 లాంచ్ వెహికిల్ రాకెట్‌తో భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం మరింత సులభం అవుతుంది. అలాగే 22 టన్నుల త్రస్ట్ సామర్థ్యంతో రాకెట్ పేలోడ్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీంతో ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే వీలుంటుంది.
ఇంజిన్‌పై ఇలాంటి పరీక్షలు నిర్వహించడం వల్ల భవిష్యత్ రాకెట్ ప్రయోగాల్లో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. దీంతో రాకెట్ల పనితీరు మరింత విశ్వసనీయంగా మారుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఈ రాకెట్‌ను ఉపయోగించి చంద్రయాన్ వంటి అంతరిక్ష మిషన్లతో పాటు భవిష్యత్ మానవ అంతరిక్ష యానం గగన్‌యాన్ మిషన్ చేపట్టేందుకు కూడా ఉపయోగపడుతుంది. క్రయోజెనిక్ ఇంజిన్ సాంకేతికతను అభివృద్ధి చేసుకున్న దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ. ఈ నేపథ్యంలో తాజా పరీక్షతో అంతరిక్ష రంగంలో భారత్ స్థానం మరింత బలపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
