Let's talk: editor@tmv.in
సీఈసీ తొలగింపు నోటీసులు తిరస్కరణ

సీఈసీ తొలగింపు నోటీసులు తిరస్కరణ

Pinjari Chand
8 ఏప్రిల్, 2026

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులను తిరస్కరించడంపై కాంగ్రెస్ స్పందించింది. గతంలో ప్రతిపక్ష ఎంపీల పిటిషన్‌ను అంగీకరించిన రాజ్యసభ ఛైర్మన్‌కు ఏమి జరిగిందో తమకు తెలుసని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాకృష్ణన్ సోమవారం తిరస్కరించిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన పిటిషన్‌ను అంగీకరించిన గత రాజ్యసభ ఛైర్మన్‌కు ఏమి జరిగిందో మాకు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మాజీ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ మాజీ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌‌ను ఉద్దేశించి చేసినవిగా భావిస్తున్నారు. ఆయన ఆరోగ్య కారణాలను చూపుతూ ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(5) తో పాటు ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షాలు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌లకు వేర్వేరుగా నోటీసులు సమర్పించాయి. అయితే వాటిని ఇద్దరూ ఆమోదించకుండా తిరస్కరించారు.

సీఈసీ తొలగింపుపై ప్రతిపక్షాల నోటీసు.. 193 మంది ఎంపీల మద్దతు

ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసుకు మొత్తం 193 మంది ఎంపీలు మద్దతు ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో రాజ్యసభలో 63 మంది, లోక్‌సభలో 130 మంది ఎంపీలు సంతకం చేశారు. నియమాల ప్రకారం రాజ్యసభలో కనీసం 50 మంది ఎంపీలు, లోక్‌సభలో కనీసం 100 మంది ఎంపీలు సంతకం చేస్తేనే తొలగింపు ప్రక్రియకు సంబంధించిన నోటీసును సమర్పించవచ్చు. ఈ అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ మంది ఎంపీలు మద్దతు ఇచ్చినప్పటికీ, నోటీసును అంగీకరించలేదు.