
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ తొలగింపునకు ప్రతిపక్షాల నోటీసులు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌లో నోటీసులు సమర్పించారు. నియామక ప్రక్రియలో జరిగిన వివాదాలు, ప్రతిపక్ష నేతపై చేసిన వ్యాఖ్యలు, ఇటీవల ఎన్నికల్లో ఓటర్ల జాబితా మార్పుల ఆరోపణలు వంటి అంశాలను నోటీసుల్లో ప్రస్తావించినట్లు ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభల్లో శుక్రవారం సమర్పించిన ఈ నోటీసుల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై జరిగిన పరిణామాలు, ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియపై ప్రతిపక్షం వ్యక్తం చేసిన అనుమానాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఎన్నికల జాబితాలపై చేపట్టిన ఓటరు జాబితా ప్రక్షాళన ప్రక్రియపై కూడా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
సీఈసీ నియామక సమయంలో 2025 ఫిబ్రవరిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సమర్పించిన విభేద నోట్‌ను కూడా నోటీసుల్లో ప్రస్తావించినట్లు సమాచారం. సీఈసీ ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అర్ధరాత్రి సమయంలో తీసుకున్న నిర్ణయం అనుచితమని అప్పట్లో రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని నమోదు చేసినట్లు ప్రతిపక్ష నేతలు గుర్తుచేశారు. సీఈసీ ఎంపిక ప్రక్రియపై కేసు సుప్రీంకోర్టులో విచారణకు ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం తగదని ఆయన పేర్కొన్నారు. ఇక 2025 ఆగస్టులో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓటు చోరీ ఆరోపణలపై స్పందించిన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ సవాల్ విసిరిన విషయాన్ని కూడా నోటీసుల్లో ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అఫిడవిట్‌తో తన ఆరోపణలను నిరూపించాలన్నా లేదా క్షమాపణ చెప్పాలన్నా నిర్ణయం తీసుకోవాలని ఆయన అప్పట్లో సూచించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో మార్పులు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను కూడా నోటీసుల్లో చేర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటకలోని అలాంద్, మహాదేవపుర నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా మార్పులపై అభ్యంతరాలు వ్యక్తమైనట్లు ప్రతిపక్షం పేర్కొంది.
ఈ నోటీసులకు లోక్‌సభలో సుమారు 130 మంది సభ్యులు, రాజ్యసభలో 60 మంది సభ్యులు సంతకం చేసినట్లు సమాచారం. వీరిలో ఇండియా బ్లాక్‌కు చెందిన పార్టీలు, అలాగే ఆమ్‌ఆద్మీపార్టీ సభ్యులు, కొంతమంది స్వతంత్ర ఎంపీలు ఉన్నారు. సీఈసీని పదవి నుంచి తొలగించే ప్రక్రియ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంతో సమానంగా ఉంటుంది. నిరూపిత దుర్వ్యవహారం, పనితీరులో అసమర్థత ఉన్నట్లు తేలితే మాత్రమే ఇంపీచ్‌మెంట్ ప్రక్రియ చేపట్టవచ్చు. రెండు సభలు నోటీసులను ఆమోదిస్తే, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ సంయుక్తంగా ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక ప్రముఖ న్యాయ నిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించిన తర్వాత ఆ నివేదికను రెండు సభల్లో చర్చకు పెడతారు. అనంతరం రెండు సభలు తీర్మానాన్ని ఆమోదిస్తేనే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించే ప్రక్రియ పూర్తవుతుంది.
