
సీఈసీకి సీఎం మమతా ఘాటు లేఖ
పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ‘స్ట్రక్చరల్‌గా అసౌండ్’(ఎటువంటి విధానం లేకుండా) ప్రజలను, అధికారులను బలవంతంగా తొక్కే ప్రక్రియగా పేర్కొంటూ సీఎం మమతా బెనర్జీ గురువారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఘాటుగా లేఖ రాశారు. ఎలాంటి ప్రాథమిక ఏర్పాట్లు లేకుండా, స్పష్టమైన మార్గదర్శకాలేవీ ఇవ్వకుండా, అసాధ్యమైన గడువులతో సాగుతున్న ఈ ప్రక్రియ ఎన్నికలపై ఉన్న విశ్వాసాన్నే దెబ్బతీస్తోందని ఆమె ఆరోపించారు.
బీఎల్వోలకు నరకయాతన
బీఎల్వోలు తమ సాధారణ విధులను నిర్వర్తించడమే పెద్ద పని. అలాంటిది అదనంగా ఇంటింటికీ వెళ్లి డేటా సేకరించడం, ఇ-సబ్మిషన్స్ ఇవి మనుషులు చేయలేని విధంగా ఉన్నాయి అని మమత ఆరోపించారు. సర్వర్ సమస్యలు, ఆన్‌లైన్ ఫారమ్స్ మిస్‌మ్యాచ్, సరైన ట్రైనింగ్ లేకపోవడంతో బీఎల్వోలు తప్పిదాలకే గురయ్యే స్థితి ఏర్పడిందని ఆమె లేఖలో తెలిపారు. డిసెంబర్ 4 లోపు సమగ్ర డేటా అప్‌లోడ్ అవుతుందని అనడం అసలు వాస్తవం కాదు అని స్పష్టం చేశారు. బీఎల్వోలపై ఒత్తిడి కారణంగా తప్పు ఎంట్రీలు, అసంపూర్ణ డేటా సమర్పించే అవకాశం ఉంటుందని , ఇది నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని మమత హెచ్చరించారు.
సీఈఓ బెదిరింపులు
వాస్తవ పరిస్థితిని అంగీకరించి సహాయం చేయాల్సిన రాష్ట్ర సీఈఓ ఆఫీస్ షోకాజ్ నోటీసుల భయంతో బీఎల్వోలను మానసికంగా వేధిస్తోంది. భయపెట్టి పని చేయించడం కమిషన్ విధానం అయిపోయింది అని ఆమె మండిపడ్డారు.
పంట సీజన్‌లో ప్రజలను ఇంట్లో ఎలా కలుస్తారు?
ప్రస్తుతం రాష్ట్రంలో వరి కోత, రబీ విత్తనం పీక్ సీజన్‌లో ఉన్నందున రైతులు, కూలీలు ఇంట్లో ఉండరని, ఇంత కీలక సమయంలో ఇంటింటికీ సర్వే తప్పదన్న ఈసీ వాదన అన్యాయమని మమత పేర్కొన్నారు. మాల్ (జల్పాయిగురి)లో ఎస్ఐఆర్ ఒత్తిడితో ఓ ఆంగన్‌వాడీ వర్కర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ ఈ గందరగోళం ప్రాణాలు తీసే స్థితికి చేరింది. మూడేళ్లలో చేసే ప్రక్రియను మూడు నెలల్లో చేయాలనుకోవడం అమానుషం అని పేర్కొన్నారు.
తక్షణమే ఎస్ఐఆర్ నిలిపేయాలి
ప్రణాళిక లేకుండా సాగుతున్న ఈ బలవంతపు డ్రైవ్‌ను వెంటనే నిలిపివేయాలి. ట్రైనింగ్, సమయం, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. లేకపోతే ఇది ఎన్నికల వ్యవస్థకే తిరుగులేని నష్టం చేస్తుందని వివరించారు.
