
సిల్వర్ ఇన్వెస్టర్లు జాగ్రత్త : హెచ్ఎస్‌బీసీ హెచ్చరిక
2025లో వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగి, రికార్డు స్థాయిలో ఒక ఔన్సు ధర 80 డాలర్ల పైకి చేరిన తర్వాత, తీవ్రమైన అస్థిరత మధ్య మళ్ళీ కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే వెండి 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ నివేదిక (హెచ్ఎస్‌బీసీ) ప్రకారం, ఈ ధరల పెరుగుదల సంప్రదాయ పారిశ్రామిక అవసరాల కంటే, మార్కెట్‌లో వెండి లభ్యత తక్కువగా ఉండటం, అలాగే పెట్టుబడిదారుల డిమాండ్, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి వల్లనే ఎక్కువగా జరిగింది.
నివేదికలోని కీలక ముఖ్యాంశాలు:
ప్రస్తుతం వెండి ధరలు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్ఎస్‌బీసీ అంచనా వేసింది. సరఫరాలో అంతరాయాల కారణంగా 2026 ప్రథమార్ధం వరకు మార్కెట్‌లో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని, లండన్, సిఎమ్ఇ ఫ్యూచర్స్ మార్కెట్లలో వెండి డెలివరీకి తీవ్రమైన కొరత ఏర్పడిందని, ఇది స్వల్పకాలికంగా ధరలపై ప్రభావం చూపుతోందని నివేదిక పేర్కొంది.
సాధారణంగా బంగారం ధరలను బట్టి వెండి కదులుతుంది. కానీ ప్రస్తుతం వెండి తన సొంత డిమాండ్, సరఫరా సమీకరణాల ఆధారంగానే ఎక్కువగా ట్రేడ్ అవుతోంది. అయినప్పటికీ, బంగారం ధరలు వెండికి ఒక మద్దతుగా నిలుస్తున్నాయి.
2025లో వెండి ఈటీఎఫ్ లలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2026లో కూడా ఇవి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, గతంతో పోలిస్తే వేగం తగ్గొచ్చని భావిస్తున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు చర్చలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడే డాలర్ విలువ వెండి ధరలకు మద్దతునివ్వవచ్చు.
సరఫరా, భవిష్యత్తు అంచనాలు
ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, గనుల నుండి వెండి ఉత్పత్తి స్వల్పంగానే పెరుగుతోంది. పాత వెండి రీసైక్లింగ్ పెరిగినప్పటికీ, మార్కెట్ స్థిరపడటానికి సమయం పట్టవచ్చు. వెండి మార్కెట్ లోటు 2025లో 230 మిలియన్ ఔన్సులుగా ఉండగా, అది 2026లో 140 మిలియన్ ఔన్సులకు తగ్గుతుందని అంచనా. 2026లో వెండి సగటు ధర 68 డాలర్లు/ఔన్సుగా, 2027లో 57 డాలర్లు/ఔన్సుగా ఉండవచ్చని హెచ్ఎస్‌బీసీ అంచనా వేసింది.
ప్రస్తుతానికి వెండి ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, మార్కెట్ తీవ్రమైన రిస్క్, అస్థిరతలో ఉంది. సరఫరా సమస్యలు తీరిన తర్వాత ధరల్లో భారీ తగ్గుదల వచ్చే అవకాశం ఉందని పెట్టుబడిదారులను హెచ్ఎస్‌బీసీ నివేదిక హెచ్చరించింది. 2026 ద్వితీయార్ధం నుండి మార్కెట్ లోటు తగ్గి, ధరలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవచ్చని ఈ సంస్థ పేర్కొంది.
హెచ్ఎస్‌బీసీ నివేదికలో పేర్కొన్నట్లుగానే, 2026 ప్రారంభంలో భారతీయ మార్కెట్‌లో వెండి ధరలు అత్యంత గరిష్ట స్థాయిల వద్ద కొనసాగుతూ విపరీతమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి . జనవరి 8, 2026 నాటికి భారతదేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు సుమారుగా కిలో వెండి ధర హైదరాబాద్, విజయవాడలలో రూ. 2,72,000 నుండి రూ.2,83,000 ఉండగా, ఢిల్లీ / ముంబై లలో రూ.2,57,100 నుండి రూ. 2,74,100 ఉన్నాయి. ఇక చెన్నై / బెంగళూరులో రూ.2,74,000 నుండి రూ.2,77,000 మద్య ఉన్నాయి.
2025లో కిలో వెండి ధర సుమారు రూ.90,000 నుండి ఏకంగా రూ.2,50,000 దాటిపోయింది. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే దాదాపు 170% పెరగడం గమనార్హం.
అలాగే జనవరి 1, 2026న కిలో వెండి ధర రూ. 2,38,000 ఉండగా, కేవలం వారం రోజుల్లోనే రూ.2,80,000 వరకు వెళ్లి, మళ్ళీ స్వల్పంగా తగ్గింది. హెచ్ఎస్‌బీసీ హెచ్చరించినట్లుగానే ఈ "అస్థిరత" మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్, పారిశ్రామిక అవసరాల వల్ల ధరలు పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లోని సరఫరా లోటు భారతీయ ధరలపై బలమైన ప్రభావాన్ని చూపుతోంది.
