Let's talk: editor@tmv.in
సిలబస్ ఎక్కువ - స్పష్టత తక్కువ: ప్రాథమిక విద్యలో పెద్ద లోపం

సిలబస్ ఎక్కువ - స్పష్టత తక్కువ: ప్రాథమిక విద్యలో పెద్ద లోపం

Dr.Chokka Lingam
11 డిసెంబర్, 2025

భారతదేశంలో పాఠశాలల్లో చేరిక రేట్లు పెరిగాయి, తరగతులు నిండిపోయాయి, పుస్తకాలు సమయానికి అందుతున్నాయి. కానీ ఈ సంఖ్యల వెనుక ఒక తీవ్ర సమస్య కనబడకుండా అణగారిపోయింది. "సిలబస్ ఎంత పూర్తయింది?" అనే వ్యవస్థే కానీ, "అర్థమైందా?" అనే వ్యవస్థ లేదు. పుస్తకాలు పెద్దగా, పాఠ్యాంశాలు ఎక్కువగా, పరీక్షలు ఒత్తిడిగా మారడంతో, విద్యార్థులు తాము చదువుతున్న వాటి భావము గ్రహించలేని పరిస్థితి ఏర్పడుతోంది.భారత విద్య వ్యవస్థలోని పెద్ద విరోధాభాసం ఇదే చదువు పెరుగుతోంది నేర్చుకున్నది తగ్గుతోంది.

తరగతి గదిలో వినిపించే పాఠ్యభారం యొక్క నిజ రూపం

తరగతి గదిలో తరచూ కనబడే‌ దృశ్యం. ఉపాధ్యాయుడు వేగంగా పాఠాలు చెప్పడం, విద్యార్థులు నోట్స్ కాపీ చేయడం, అర్థం చేసుకోకుండా నిర్వచనాలు కంఠస్థం చేయడం. పాఠ్యపుస్తకాల కమిటీలు రచించిన విధానానికి అనుగుణంగా సంవత్సరానికి 15–20 అధ్యాయాలు పుస్తకాలలో‌ నింపబడతాయి. ఇవన్నీ ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలనే బలవంతం ఉంటుంది.ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు చెప్పిన మాట: “నిజంగా అర్థం వచ్చేలా బోధిస్తే పాఠ్యాంశం పూర్తయ్యేది కాదు. పాఠ్యాంశం పూర్తిచేస్తే విద్యార్థులకు అర్థం కాదు. వ్యవస్థ కోరేది సిలబస్ పూర్తి చేయమనే, నేర్చుకోవడం కాదు.”

మూడో తరగతి నుండే పిల్లలపై భారం

ఎనిమిదేళ్ల పిల్లవాడు ఇంగ్లీషు, గణితం, పర్యావరణ శాస్త్రం, వ్యాకరణం, హస్తలేఖనం వంటి విషయాలను ఒకేసారి నేర్చుకోవాల్సి వస్తుంది.ఒక మూడో తరగతి విద్యార్థికి అదే సంవత్సరంలో 1–10 వరకు ఎక్కాలు, భిన్నాలు ప్రాథమికాలు, కాలం కొలతలు మొదలైనవన్నీ నేర్పాలని పాఠ్యపుస్తకాలు చెబుతాయి. కానీ ఈ వయసులో పిల్లలు “భావనాత్మక అవగాహన” కంటే “మూసపద్ధతి”తో నేర్చుకునే దశలో ఉంటారు. పాఠ్యభారం పైనుండి పడుతున్న బరువుతో గుణింతాలు కాన్సెప్ట్ గా కాకుండా కేవలం “కంఠస్థం చేయాల్సిన పట్టిక”గా మారిపోతుంది.

అర్థమవకపోయినా బట్టీ కొట్టు

భారత విద్యార్థుల్లో పెద్ద సమస్య- “అర్థం చేసుకోకుండా బట్టీకొట్టు.” ఉదాహరణకు ఒక పరిశోధకురాలు ఒక పరీక్షలో 5వ తరగతి పిల్లలను “నీడ ఎందుకు మారుతుంది?” అని అడిగారు. చాలా మంది పిల్లలు పుస్తకంలోని వాక్యాన్ని చెప్పారు: “భూమి తిరుగుతోంది కాబట్టి నీడ మారుతుంది.”కానీ టార్చ్‌తో కర్ర పట్టించి నీడ ఎలా మారుతుందో చూపించమంటే చూపలేకపోయారు.పాఠ్యభారం వల్ల వచ్చిన ఈ “పైపై చదువులు ” సర్వ సాధారణమైపోయింది.

ఇంగ్లీషు మీడియం: మరింత భారంగా పాఠ్యాంశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలు వేగంగా ఇంగ్లీషు మీడియం వైపు వెళ్లాయి. కానీ పాఠ్యాంశం మాత్రం అదే గజిబిజిగా, భారంగా, ఆ భాషకు అలవాటు లేని చిన్నారులకు పునాదుల్లా కాకుండా అడ్డుగోడలా మారిపోయింది. ఉదాహరణకు, 4వ తరగతి పిల్లలు “కిరణజన్య సంయోగ క్రియ” అని వల్లె వేసి చెబుతారు. కానీ అది మొక్కల ఆహార ప్రక్రియ అని తెలుగులో చెప్పమంటే చెప్పలేరు. మనం అక్షరాలనూ, పదాలనూ నేర్పిస్తున్నారు కాని “విషయం నేర్పడం లేదు.

5వ తరగతిలో పాఠాలు: భావనాత్మక గందరగోళానికి నిదర్శనం

5వ తరగతిలో భిన్నాలు అత్యంత క్లిష్టమైన అధ్యాయం.పుస్తకాలు ఒకేసారి నుమెరేటర్, డినమినేటర్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్, కంపారిజన్, ఎడిషన్ లాంటి అనేక భావనలను గుదిబండలా నింపేస్తాయి.ఒక ఉపాధ్యాయుడు 1/8, 1/4 లో ఏది పెద్దదో అడిగితే పిల్లలు చాలామంది “1/8 పెద్దది, ఎందుకంటే 8 పెద్ద సంఖ్య” అన్నారు.పూర్తి సంఖ్యల తర్కాన్ని ఫ్రాక్షన్స్ మీదకు రుద్దేశారు. ఎందుకంటే కాన్సెప్ట్ గ్రహించేందుకు అవసరమైన సమయం పాఠ్యభారంలో పోతుంది.

ఉపాధ్యాయురాలు ఆపిల్‌ని నాలుగు ముక్కలు, ఎనిమిది ముక్కలు చేసి చూపించగానే పిల్లల ముఖంలో ఆశ్చర్యం కనిపించింది.“అంటే 1/4 పెద్దదా?” అని వారు ఆశ్చర్యపోయారు.ఇదే భావనాత్మక బోధన. కానీ కరిక్యులుం ఓవర్లోడ్ వల్ల ఇది తరగతి గదిలో జరగడానికి ఎక్కువ మందికి అవకాశం ఉండదు.

అప్లికేషన్ తెలీని సైన్స్ బోధన

6 నుంచి 10 తరగతులు వరకు సైన్స్ తరగతుల్లో అటొమ్స్, మోలక్యులేస్, సర్క్యూట్స్, రెస్పిరేషన్, ఎకాసిస్తెమ్స్ వంటి అనేక అంశాలు బోధించాలి. కానీ అసలు ప్రయోగాలు చేయడానికి ల్యాబ్ లేదు, సమయం లేదు, సామగ్రి లేదు.ఉదాహరణకు 7వ తరగతి విద్యార్థిని ఒకసారి ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎలా తెగిపోతే బల్బు వెలగదో వివరించింది. కానీ ఆమె నోట్ పుస్తకంలో ఓపెన్ సర్క్యూట్ ఏదో చూపమంటే గుర్తించలేకపోయింది.“వాక్యాలు తెలుసు, భావన తెలియదు” అనే ఈ పరిస్థితి మితిమీరిన సిలబస్ వల్లే.

సామాజిక శాస్త్రాలు: సమాచారపు వరద

చరిత్రలో యుద్ధాల తేదీలు, రాజుల పేర్లు, పరిపాలనా పదాలు ఇన్ని వివరాలు. భూగోళ శాస్త్రంలో వాతావరణం, నేల రకాలు, ఖనిజాలు, పటాల పఠనం ఇంకా అంతకంటే ఎక్కువ. ఉదాహరణకు ఓ టీచర్ మాటలు: “పరీక్షల సమయంలో పిల్లలు నడిచే ఎన్సైక్లోపీడియాలవుతారు. పరీక్షలు ముగిసిన వెంటనే అన్నీ మర్చిపోతారు.” గొప్ప భావనలను మేమోరిసింగ్ ఫ్యాక్ట్స్ గా మార్చడం పాఠ్యభారం వల్లే.

పాఠ్యభారంతో ఉపాధ్యాయుల పోరాటం

విద్యార్థులు నిజంగా నేర్చుకోవడం లేదని ఉపాధ్యాయులకు తెలుసు. కానీ సిలబస్ పూర్తి చేయడం, పరీక్షల పట్టిక, స్కూల్ తనిఖీలు వారిని వాస్తవిక బోధనకు దూరంగా నడిపిస్తాయి.ఉదాహరణకు ఒక ఉపాధ్యాయురాలు 8వ తరగతిలో లో “మౌలికసదుపాయలు” అనే విస్తృతమైన అధ్యాయాన్ని కేవలం రెండు రోజుల్లో పూర్తి చేయాల్సి వచ్చిందని చెప్పారు. “ఇంత విపులమైన విషయాన్ని రెండు రోజుల్లో ఎలా బోధించగలను?” అనే ఆమె ప్రశ్న విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న అసలు సంక్షోభం.

హోం వర్క్ కాపీ, ప్రాజెక్టు పని తల్లిదండ్రులకు

వాస్తవంగా నేర్పే పనులు కాకుండా చార్టులు, కాపీలు, నిర్వచనాలు మళ్లీ మళ్లీ రాయించడం ఇవే గృహపాఠాల రూపం. ప్రాజెక్టులు కూడా తల్లిదండ్రులు చేసి ఇస్తున్నారు . విద్యార్థి నేర్చుకునేది ఏమీలేదు. ఇదంతా ఓ ప్రహసనం

మొదటి తరగతి నుంచే వెనుకబడే పేద, గ్రామీణ పిల్లలు

మొదటి తరగతి నుంచే పాఠ్యభారం పైనుండి నొక్కినట్లవుతుంది.ఒక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతిలో ముగ్గురు పిల్లలు తెలుగు చదవలేకపోయినా, వాళ్లు అదే వయసులో స్ట్రక్చర్ ఆఫ్ అటొం, ముఘల్ హిస్టరీ, లినియార్ ఈక్వేషన్స్ అన్నీ ఇంగ్లీషులో నేర్చుకోవాలి.

NEP 2020 ఇచ్చిన వాగ్దానం: లోతుగా నేర్పించే పాఠ్యక్రమం

జాతీయ విద్యా విధానం 2020 కరిక్యులం భారం తగ్గించాలని స్పష్టం చేసింది. కాన్సెప్ట్ లెర్నింగ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ పై దృష్టిపెట్టాలని సూచించింది. అయితే రాష్ట్రాలు అమలు చేయడంలో వెనుక బడుతున్నాయి. సరైన శిక్షణ లేకుండా పాఠ్య పుస్తకాలు మార్చినంత మాత్రాన విద్యార్థి నిజంగా నేర్చుకొనేదానిలో పెద్ద మార్పు వుండదు.

పాఠాల‌ సంఖ్య ఎక్కువ,లోతు తక్కువ

భారతదేశ విద్యావిధాన లోపం ఇదే మరిన్ని టాపిక్స్, కొన్ని టాపిక్స్. ఫిన్లాండ్, జపాన్ వంటి దేశాలు తక్కువ కాన్సెప్ట్స్ నే బోధించి లోతుగా నేర్పిస్తాయి. భారతదేశం మాత్రం పుస్తకం మందంగా ఉంటే "చదువు పెద్దది" అని భావించే వ్యవస్థను కొనసాగిస్తోంది.

పాఠ్యభారం తగ్గితేనే భావనాత్మక స్పష్టత పెరుగుతుంది

భారత విద్యా భవిష్యత్తు “ఎంత బోధించాం?” అన్న ప్రశ్నలో లేదు.“ఎంత అర్థమైంది?” అన్న ప్రశ్నలో ఉంది.పాఠ్యభారం తగ్గితే, ఉపాధ్యాయులకు సమయం దొరికితే, ప్రయోగాలు, చర్చలు, అనుభవ ఆధారిత బోధన పెరిగితేనే భారత విద్యార్థులు నిజమైన భావనాత్మక స్పష్టతను పొందగలరు.పుస్తకం మందంగా ఉండడం కాదు, విద్యార్థి అర్థం చేసుకోవడం విద్య యొక్క అసలు ప్రమాణం.

సిలబస్ ఎక్కువ - స్పష్టత తక్కువ: ప్రాథమిక విద్యలో పెద్ద లోపం - Tholi Paluku