
సిరిసిల్ల నేతన్నల రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని డిప్యూటీ సీఎంకు కేటీఆర్ విజ్ఞప్తి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుండి నేతన్నలను కాపాడాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిశారు. అసెంబ్లీ వేదికగా వారికి వినతి పత్రాన్ని అందజేస్తూ, సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలను వెంటనే మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్లలోని పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, బ్యాక్ బిల్లింగ్, సర్‌ఛార్జీల భారంతో వేలాది నేతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ వివరించారు. ముఖ్యంగా 2016 నుంచి 2024 వరకు 127 ఎస్ఎస్ఐ యూనిట్లపై సుమారు రూ.19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ విధించగా, సర్‌ఛార్జీలతో కలిపి ఈ మొత్తం రూ.38 కోట్లకు చేరిందని చెప్పారు.
ఈ భారీ భారం కారణంగా అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు బాధాకరమని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ రాష్ట్రానికి కీలకమైనదని, గతంలో ఇక్కడి నేతన్నలు ఎదుర్కొన్న కష్టాలను ప్రభుత్వం గుర్తించాలని కేటీఆర్ కోరారు. పాత బకాయిలను పరిగణనలోకి తీసుకోకుండా, విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలను నిరంతరంగా అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బ్యాక్ బిల్లింగ్, సర్‌ఛార్జీలను పూర్తిగా రద్దు చేసి, పరిశ్రమను కాపాడాలని సూచించారు.
కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించడం అత్యవసరమని ఆయన తెలిపారు. ఈ సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి, సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
