
సిరిసిల్లలో ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కార్డుల పంపిణీ: కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్సూరెన్స్ (ప్రమాద బీమా) బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని ఆటో డ్రైవర్లకు సంక్రాంతి పండుగ వరకు బీమా కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆటోడ్రైవర్‌ల పాత్ర కీలకమని గుర్తుచేశారు. కేసీఆర్ దీక్షలు, ఉద్యమాల్లో సబ్బండ వర్గాల్లాగే ఆటోడ్రైవర్‌లు కూడా ముందుండి పోరాడారని ఆయన అన్నారు. దేశంలో రైతులకు బీమా అందించిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, అలాగే గీతన్నలు, నేతన్నలు సహా కార్మిక వర్గాలకు పథకాలు తీసుకొచ్చిన నిజమైన కార్మిక పక్షపాతి ఆయనేనని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో ప్రజలను మోసం చేసిందని ఆరోపించిన కేటీఆర్, “మార్పు మార్పు అంటూనే మోసం ఎలా ఉంటుందో ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించారు’’ అని అన్నారు. రాహుల్ గాంధీ మష్రత్ అలీ ఆటోలో ప్రయాణించి హామీలు ఇచ్చినా, నేడు అలీ రెండు ఆటోలు అమ్ముకుని కిరాయి ఆటో నడుపుతున్న స్థితికి చేరాడని ఆయన విమర్శించారు.
రైతులకు రుణ మాఫీ చేశామంటూ దేవుళ్లపై అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నారని కేటీఆర్ తీవ్రమైన విమర్శలు చేశారు. 420 హామీలతో రాష్ట్రాన్ని మోసం చేశారని, ఆటోడ్రైవర్లకు నెలకు వెయ్యి రూపాయిల చొప్పున ఇవ్వాల్సిన సహాయాన్ని నిలిపివేయడంతో రెండు సంవత్సరాల్లో రూ. 1,560 కోట్లు బకాయి అయ్యిందని తెలిపారు.సిరిసిల్ల జిల్లాలో అన్ని వాహనాల డ్రైవర్లకు సంక్రాంతికల్లా బీమా సదుపాయం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల వరకు ఆటోడ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోతే, హైదరాబాద్‌లో మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. ఆత్మహత్యలకు పాల్పడిన ఆటోడ్రైవర్‌ల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం అందించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
