
సిరియాలో ఐసీస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐసీస్) ఉగ్రవాదులపై అమెరికా సైన్యం పిడుగులా విరుచుకుపడింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులతో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) పర్యవేక్షణలో జరిగిన ఈ భారీ ఆపరేషన్‌లో ఐసీస్‌కు చెందిన కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు కొనసాగాయి.
దేశవ్యాప్తంగా ఐసీస్ లక్ష్యాలపై దాడులు
సిరియా అంతటా ఉన్న ఐసీస్ స్థావరాలు, మౌలిక వసతులు, ఆయుధ గిడ్డంగులు ఈ దాడుల లక్ష్యాలుగా మారాయి. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని సెంట్కామ్ వెల్లడించింది. అమెరికా సైనికులపై దాడులను అడ్డుకోవడం, భవిష్యత్తులో దాడులు జరగకుండా నివారించడం, ప్రాంతంలో ఉన్న అమెరికా బలగాలు భాగస్వామ్య బలగాల భద్రతను కాపాడటం ఈ చర్యల ఉద్దేశమని స్పష్టం చేసింది.
ట్రంప్ ఆదేశాలతో ఆపరేషన్ ప్రారంభం
డిసెంబర్ 19, 2025న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ హాక్‌ఐ స్ట్రైక్’ను ప్రారంభించారు. డిసెంబర్ 13న సిరియాలోని పాల్మైరా ప్రాంతంలో ఐసీస్ ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఆ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు ఒక అమెరికన్ పౌర అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు.
ఆ దాడిలో మరణించిన అమెరికా సైనికులుగా 25 ఏళ్ల సార్జెంట్ ఎడ్గర్ బ్రియాన్ టోరెస్ టోవార్, 29 ఏళ్ల సార్జెంట్ విలియం నాథనియల్ హోవర్డ్‌గా గుర్తించారు. ఇద్దరూ ఐవా నేషనల్ గార్డ్‌కు చెందినవారు. మృతిచెందిన పౌర అనువాదకుడి పేరు అయాద్ మంసూర్ సకాత్‌గా అధికారులు తెలిపారు.
భారీ స్థాయిలో సైనిక వినియోగం
సీఎన్‌ఎన్ కథనం ప్రకారం తాజా దాడుల్లో 90కి పైగా ప్రెసిషన్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించారు. 20కి పైగా యుద్ధ విమానాలతో 35కిపైగా ఐసీస్ లక్ష్యాలను ఛేదించారు. ఇది గత నెలలో నిర్వహించిన దాడుల కొనసాగింపుగా అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 19న ప్రారంభ దశలోనే సెంట్రల్ సిరియాలో 70 ఐసీస్ లక్ష్యాలపై దాడులు జరిపిన విషయం గుర్తుచేశారు.
సెంట్కామ్ హెచ్చరిక
“అమెరికా సైనికులకు హాని చేస్తే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి మరీ అంతమొందిస్తాం. న్యాయం నుంచి తప్పించుకోవడం అసాధ్యం” అని సెంట్కామ్ ఘాటుగా హెచ్చరించింది. ఉగ్రవాదులపై పోరాటంలో అమెరికా బలగాలు వెనక్కి తగ్గవని స్పష్టం చేసింది.
సిరియాలో కొనసాగుతున్న అమెరికా ఉనికి
ప్రస్తుతం సిరియాలో సుమారు వెయ్యి మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఐసీస్ నిర్మూలన లక్ష్యంగా కొనసాగుతున్న ‘ఆపరేషన్ ఇన్హెరెంట్ రిజాల్వ్’లో భాగంగా ఈ బలగాలు పనిచేస్తున్నాయి. గత ఏడాది ప్రారంభంలోనే సుమారు 1,800 మంది సైనికులను మధ్యప్రాచ్యానికి పంపినట్లు అమెరికా అధికారులు తెలిపారు.
సిరియా ప్రభుత్వ సహకారం
సిరియాలో 13 ఏళ్ల సుదీర్ఘ పౌరయుద్ధం తర్వాత 2024లో బషర్ అల్-అస్సాద్ పాలన అంతమవ్వగా, ప్రస్తుతం మాజీ తిరుగుబాటు దారుల నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒకప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఈ బృందాలు, ఇప్పుడు ఉమ్మడి శత్రువైన ఐసీస్ ఉగ్రవాదులను అణచివేసేందుకు అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ కూటమితో చేతులు కలిపాయి. ఈ క్రమంలోనే సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా గత ఏడాది వైట్ హౌస్‌ను సందర్శించి భద్రతా పరమైన ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా సిరియాలోని ఐసీస్ స్థావరాలపై అమెరికా జరిపిన భీకర దాడుల్లో సిరియా భద్రతా దళాలు కూడా క్రియాశీలకంగా సహకరించాయి, అయితే ఈ దాడుల్లో జరిగిన ప్రాణనష్టంపై అమెరికా సైన్యం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
