
సిరియాలోని డమాస్కస్ మ్యూజియంలో ఆరు పురాతన విగ్రహాల చోరీ
పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లూవ్రే మ్యూజియంలో భారీ చోరీ ఘటన మరువక ముందే ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో మరో చారిత్రక మ్యూజియంలో చోరీ జరిగింది. సిరియాలోని ప్రముఖ మ్యూజియాల్లో ఒకటైన డమస్కస్ జాతీయ మ్యూజియం నుండి అరుదైన ఆరు పురాతన విగ్రహాలు చోరీకి గురికావడం కలకలం సృష్టించింది. మధ్యప్రాచ్యంలోనే అత్యంత పురాతనమైన ఈ మ్యూజియం సిరియా పురావస్తు, కళాత్మక వారసత్వానికి నెలవుగా ఉంది.
రాయిటర్స్ వార్తా సంస్థకు మ్యూజియంలోని ఒక అధికారి తెలిపిన సమాచారం ప్రకారం, ఈ దొంగతనం సోమవారం జరిగింది. ఒక దొంగ మ్యూజియం లోపల ఉన్న గాజు ప్రదర్శన పెట్టెను పగలగొట్టాడు. అతడు ఆ మ్యూజియం భవనం లోపలే సాయంత్రం వరకు ఉండిపోయి, ఈ దొంగతనానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ దాడిలో ఆరు పురాతన విగ్రహాలు చోరీకి గురైనట్లు అధికారులు నిర్ధారించారు.
ఈ అసాధారణ దొంగతనంపై అధికారులు వెంటనే దర్యాప్తును ముమ్మరం చేశారు. డమస్కర్ అంతర్గత భద్రతా విభాగం అధిపతి ఒసామా మొహమ్మద్ ఖైర్ అట్కే దీనిపై స్పందించారు. ఖైర్ అట్కే మాట్లాడుతూ, దొంగతనానికి పాల్పడిన వారిని త్వరగా పట్టుకోవడానికి, దొంగిలించబడిన విలువైన కళాఖండాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలింపు, ట్రాకింగ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ సంఘటన ఎలా జరిగింది? దొంగ మ్యూజియం లోపలికి ఎలా ప్రవేశించాడు అనే విషయాలను తెలుసుకోవడానికి మ్యూజియం భద్రతా గార్డులు, ఇతర అధికారులను ప్రశ్నిస్తున్నట్లు ఆయన వివరించారు.
మ్యూజియం చరిత్ర
డమస్కస్ జాతీయ మ్యూజియాన్ని 1919లో స్థాపించారు. సిరియాలోని వివిధ నాగరికతలు- మేసొపొటేమియా, రోమన్, బైజాంటైన్, ఇస్లామిక్ యుగాల పురావస్తు, కళా, శిల్ప సంపదను ఈ మ్యూజియం ప్రదర్శిస్తుంది. దేశంలో అంతర్యుద్ధం ప్రారంభం కావడం, రాజధానిలో పోరాటాల కారణంగా 2012లో ఈ మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కొంతకాలం తర్వాత, 2018లో పాక్షికంగా తిరిగి తెరిచారు. తిరుగుబాటుదారులు మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను పదవీచ్యుతుడిని చేసిన ఒక నెల తర్వాత అంటే జనవరి 2025లో ఈ మ్యూజియం పూర్తి స్థాయిలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
చోరీకి గురైన ఈ పురాతన విగ్రహాలు సిరియా యొక్క చరిత్రలో అత్యంత విలువైనవిగా భావిస్తున్నారు. అంతర్యుద్ధంలో దెబ్బతిన్న సిరియా సాంస్కృతిక వారసత్వానికి ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.
