
సిరిమానుకు వేళాయే!
విజయనగరం ఇలవేల్పు ఉత్తరాంధ్రల ఆరాధ్య దైవం
శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు ముహూర్తం ఖరారు అయింది. అక్టోబర్ 7 వ తేదీన సిరిమాను రథయాత్ర జరుగ నున్నది. ఆరో తేదీన తొల్లెల ఉత్సవం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలనుసిద్ధం చేశారు. ఈసారి పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలతో పాటు విజయనగరం ఉత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీ పైడితల్లి అమ్మవారి శ్రీ భాను ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్నారు.
అయితే జిల్లాకు సంబంధించినంత వరకు జిల్లా అధికారులు కొత్తవారు కావడం గమనించదగ్గ విషయం. ఇటీవలే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మారారు, కొత్తవారు బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈసారైనా సరైన సమయానికే సిరిమాను రథయాత్ర కదులుతుందా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.
ఆ ముగ్గురూ కొత్తవారే
కలెక్టర్ తో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీ మారిపోయారు. కొత్త అధికారులు ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కూడా కొత్తవారే. వీరికి సిరిమాను సంబరాలు ప్రత్యేకమించి రథయాత్రపై
అవగాహన అంతంత మాత్రమే. సమీక్ష సమావేశాలలో ఉత్సవ నిర్వహణ సమావేశాలలో సిరిమాను రథయాత్రకు సంబంధించి ఇప్పుడిప్పుడే అవగాహన ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర పరిధిలో ఒక విశిష్ట స్థాయిలో నిర్వహించే సిరిమాను రథయాత్ర ఎంతైనా ఒక కొత్త విషయమే. దానిని ప్రత్యక్షంగా చూస్తేనే తప్ప ఉత్సవ నిర్వహణపై అవగాహన వచ్చే అవకాశం లేదు. అన్నింటికీ మించి తొలేళ్ళ ఉత్సవం ఆ తర్వాత జరిగే సిరిమాను రథయాత్ర సమయపాలన అన్నది ప్రధానమైన విషయం.
ఈ సారైనా టైమ్ పాటిస్తారా
ప్రతి ఏడాది సిరిమాను రథయాత్ర సమయపాలన కీలకంగా మారుతోంది. వాస్తవానికి మధ్యాహ్నం మూడు గంటలకే సిరిమాను రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అమ్మవారి చదువు గురించి కోట వరకు మూడుసార్లు రథయాత్ర జరుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటలకు రథయాత్ర ప్రారంభమైతే చీకటి పడే వాళ్ళకి అది ముగుస్తుంది. దీనివల్ల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అవుతుంది. కానీ ప్రతిసారి సిరిమాను రథయాత్ర ఆలస్యంగా ప్రారంభం కావడం మూడుసార్లు పూర్తయ్యేసరికి చీకటి పడటం జరుగుతుంది. ఎంతలా సమయానికి రథయాత్ర ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అలవాటుగా ఆలస్యం కావడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం ఈ ఏడాదైనా సిరిమాను రథయాత్ర అని అనుకున్న సమయానికే ప్రారంభిస్తారా అన్నది ప్రధాన అంశంగా మారింది. దీనికి తోడు జిల్లాకు వచ్చిన అధికారులు ముగ్గురు కొత్తవారు కావడం సిరిమాను రథయాత్రపై అనుభవం లేకపోవడం కీలకంగా మారింది.
ఈ సారీ అతుకుల రహదారే
కాగా సిరిమాను రథయాత్ర సందర్భంగా రథం తిరిగే చదురు గుడి నుంచి కోట వరకు ప్రధాన రహదారి ఈసారి కూడా అతుకుల మయం గానే
ఉండనుంది. గత కొన్ని సంవత్సరాలుగా అతుకుల రహదారే గతి అవుతోంది. సిరిమాను సంబరాలు ప్రారంభానికి ముందు హడావుడిగా ఆ రహదారిలో గోతులను పూడ్చి అతుకుల ను వేసి దానిపై రథయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తోంది. వాస్తవానికి ఆ రహదారి అంతా నూతనంగా తారు రోడ్డు వేయాలి. దానిపై రథయాత్ర సులువుగా సాగుతుంది. కానీ కొన్ని సంవత్సరాలుగా అతుకుల రహదారే వేస్తూ వస్తున్నారు. వచ్చేనెల ఏడో తేదీన సిరిమాను సంబరాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా సన్నాహక ప్రయత్నాలే కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది కూడా అతుకుల రహదారే అమ్మవారి రథయాత్రకు సిద్ధం చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే నగరం పరిధిలోని కొన్ని రహదారుల లో అతుకుల పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న నగరం పరిధిలో రహదారులకు ముఖ్యంగా కనీసం శ్రీ పైడితల్లి అమ్మవారి రథయాత్ర జరిగే ప్రధాన రహదారి వరకైనా మోక్షం కలుగు తుందేమో నని ప్రజలు భావించారు. కానీ అదేమీ కనిపించడం లేదు. ఈసారి కూడా శ్రీ పైడితల్లి అమ్మను క్షమించమని వేడుకోవడం మినహా నగర ప్రజలు మరి ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి. అటు నగరపాలక సంస్థ పాలకులు గాని ఇటు ప్రజాప్రతినిధులు గాని మరోవైపు అధికారులు గానీ ఇందుకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు ఏమీ లేవు. రాష్ట్రస్థాయి ఉత్సవంగా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలను నిర్వహించ తలపెట్టి నప్పుడు దానికి తోడు విజయనగరం ఉత్సవాలను చేయాలను కుంటున్నప్పుడు రోడ్ల దుస్థితి పై దృష్టి సారించక పోవడం శోచనీయమని నగర ప్రజలు ప్రత్యేకించి శ్రీ పైడితల్లి అమ్మవారి భక్తులు ఆక్షేపిస్తున్నారు.
