Let's talk: editor@tmv.in
సియెర్రా లియోన్‌కు భారత్ ఆపన్న హస్తం

సియెర్రా లియోన్‌కు భారత్ ఆపన్న హస్తం

Shaik Mohammad Shaffee
26 మార్చి, 2026

పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్ పట్ల భారత్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. ఆ దేశంలో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి మద్దతుగా 1,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత్ పంపినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. 'గ్లోబల్ సౌత్' దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఈ మానవీయ సాయం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.

వైద్య రంగంలోనూ అండగా..

సియెర్రా లియోన్‌కు భారత్ సాయం చేయడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది అక్టోబరులో ముంద్రా పోర్ట్ ద్వారా 15 హేమో డయాలసిస్ యంత్రాలను, పోర్టబుల్ ఆర్‌ఓ యూనిట్లను, వాటికి సంబంధించిన కిట్లను భారత్ పంపింది. ఆ దేశంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జైస్వాల్ గుర్తుచేశారు. ఈ సహాయం రెండు దేశాల మధ్య ఉన్న 'సౌత్-సౌత్ కోఆపరేషన్'కు నిదర్శనమని ఆయన కొనియాడారు.

మూడు రెట్లు పెరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం

భారత్-సియెర్రా లియోన్ మధ్య దౌత్య సంబంధాలు గత దశాబ్ద కాలంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా 2020లో సియెర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్‌లో భారత రాయబార కార్యాలయం ప్రారంభమైన తర్వాత ఇరు దేశాల మధ్య పరస్పర చర్చలు మరింత పెరిగాయి. గత పదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం మూడు రెట్లు పెరిగి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 298 మిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం.

బహుముఖ సహకారంతో ముందుకు..

ఇటీవల జరిగిన రెండో విడత విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల్లో భాగంగా.. వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో సహకారంపై ఇరు దేశాలు సమగ్ర సమీక్ష జరిపాయి. భవిష్యత్తులోనూ సియెర్రా లియోన్ సామర్థ్యం పెంపుదలకు, అభివృద్ధి భాగస్వామ్యానికి భారత్ తన సంపూర్ణ మద్దతును కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.

సియెర్రా లియోన్‌కు భారత్ ఆపన్న హస్తం - Tholi Paluku