Let's talk: editor@tmv.in
సియాటెల్‌లో స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరణ
సియాటెల్‌లో స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరణ

సియాటెల్‌లో స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరణ

Shaik Mohammad Shaffee
13 ఏప్రిల్, 2026

భారతీయ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానందుడికి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రముఖ నగరం సియాటెల్‌లో స్వామి వివేకానంద నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని శనివారం ఘనంగా ఆవిష్కరించారు. అమెరికాలో ఒక నగర ప్రభుత్వమే స్వయంగా వివేకానందుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

రద్దీ ప్రాంతంలో వివేకానందుడి విగ్రహం ఏర్పాటు

సియాటెల్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే 'వెస్ట్‌లేక్ స్క్వేర్' వద్ద ఈ విగ్రహాన్నిఏర్పాటు చేశారు. ప్రతిరోజూ సుమారు 4 లక్షల మంది పర్యాటకులు సందర్శించే ఈ ప్రదేశం.. అమెజాన్ ప్రధాన కార్యాలయం 'స్పియర్స్', సియాటెల్ కన్వెన్షన్ సెంటర్ వంటి కీలక కట్టడాలకు సమీపంలో ఉంది. ప్రముఖ భారతీయ శిల్పి నరేష్ కుమార్ కుమావత్ ఈ అద్భుతమైన విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

సియాటెల్ మేయర్ కేటీ విల్సన్, భారత కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా సంయుక్తంగా స్వామి వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సియాటెల్ నగరంలోని విభిన్న సంస్కృతులకు, సమ్మిళిత స్ఫూర్తికి ఈ విగ్రహం నిదర్శనమని పేర్కొన్నారు. భారత్-అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "1893లో చికాగో నుంచి మొదలైన వివేకానందుడి స్ఫూర్తి.. 2026లో సియాటెల్‌కు చేరుకుంది. సియాటెల్ నగర నడిబొడ్డున భారతీయ ఐకాన్ వివేకానందుడికి చోటు దక్కడం గర్వకారణం" అని సియాటెల్‌లోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది.

సాంస్కృతిక దౌత్యంలో కీలక మైలురాయి

భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి ఈ విగ్రహాన్ని సియాటెల్ నగరానికి కానుకగా అందించింది. 'ఐసీసీఆర్ డే' వేడుకల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం.. రెండు దేశాల మధ్య ప్రజల సంబంధాలను మెరుగుపరిచే దిశగా భారత్ చేపట్టిన సాంస్కృతిక దౌత్యంలో భాగంగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ సియాటెల్ ప్రాంతంలోని వివిధ నగరాల మేయర్లు, భారతీయ అమెరికన్ సమాజ ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1893లో చికాగో విశ్వమత సమ్మేళనంలో హిందూ ధర్మ విశిష్టతను ప్రపంచానికి చాటిన వివేకానందుడికి, ఈ విగ్రహావిష్కరణ ద్వారా మరోసారి అమెరికా గడ్డపై ఘన నివాళి లభించినట్లయింది.

సియాటెల్‌లో స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరణ - Tholi Paluku