
సిబిఐ చేతికి చిక్కిన సైబర్ ముఠా
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న తరుణంలో సీబీఐ మరో పెద్ద ఆర్థిక మోసాన్ని బట్టబయలు చేసింది. హెచ్‌పిజె క్రిప్టో కరెన్సీ టోకెన్ మోసం కేసులో వందల కోట్లు దోచుకున్న నేరగాళ్లపై కఠిన చర్యలు చేపట్టి ఐదుగురిని అరెస్టు చేసింది. ఈ మోసం రుణాలు, ఉద్యోగాలు, పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ వ్యాపారం పేరుతో అమలైనట్లు అధికారులు తెలిపారు.
సీబీఐ అధికారులు శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్, బెంగళూరు సహా ఐదు నగరాల్లో ఏకకాలంలో ఏడుచోట్ల దర్యాప్తు నిర్వహించారు. ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, నేరాన్ని బలపరిచే పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఈ కేసులో సీబీఐ అధికారులు క్రిమినల్ కుట్ర, వేషధారణ, మోసం వంటి నేరాలతో పాటు సమాచార సాంకేతిక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2021 నుండి 2023 మధ్య దేశవ్యాప్తంగా జరిగిన ఈ భారీ మోసాన్ని విదేశీ మాస్టర్‌మైండ్లు, భారతీయ సహచరులతో కలిసి నడిపినట్టు దర్యాప్తులో తేలింది.
ఈ విషయమై ఓ సీబీఐ అధికారి మాట్లాడుతూ రుణాలు, ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో నమ్మబలికి డబ్బు వసూలు చేసిన నేరగాళ్లు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా నకిలీ బ్యాంకు ఖాతాలను తెరిచి బాధితుల నుంచి వచ్చిన నిధులు ఆ ఖాతాల ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చారని ఆపై పలు మార్గాల్లో విదేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో భారత్‌లోనే నమోదు చేసిన అనేక షెల్ కంపెనీలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థలను ఫిన్‌టెక్, పేమెంట్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లపై చేర్చిన తరువాత ప్రజల నుండి సేకరించిన డబ్బును వివిధ క్రిప్టో వాలెట్లకు మళ్లించారు. చివరికి ఈ నిధులను అంతర్జాతీయంగా పంపించడంతో నేర లావాదేవీలను దాచిపెట్టారని అధికారులు స్పష్టం చేశారు. అరెస్టయిన ఐదుగురు నేరగాళ్లు మోసపూరిత లావాదేవీల్లో నేరుగా పాల్గొన్నారని సీబీఐ తెలిపింది.
ఇంకా కొనసాగుతున్న దర్యాప్తు
ప్రస్తుతం సీబీఐ అంతర్జాతీయ లావాదేవీల జాడను అన్వేషిస్తోంది. విదేశీ మాస్టర్‌మైండ్లు ఎవరు, వారి వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ పనిచేస్తోంది ఇంకా ఎంతమంది భారతీయులు ఇందులో పాలుపంచుకున్నారనే అంశాలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
