
సిబిఎస్‌ఈ కీలక నిర్ణయం: 2026 నుండి 12వ తరగతి పరీక్షలకు ఆన్-స్క్రీన్ మార్కింగ్
దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్న కేంద్ర మాధ్యమిక విద్యా మండలి, బోర్డు పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 2026 విద్యా సంవత్సరం నుండి జరగబోయే 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాలను 'ఆన్-స్క్రీన్ మార్కింగ్' విధానంలో దిద్దనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మూల్యాంకనంలో మరింత పారదర్శకతను పెంచడం, మానవ తప్పిదాలను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
"సామర్థ్యాన్ని, పారదర్శకతను పెంపొందించే నిరంతర ప్రయత్నంలో భాగంగా, 2026 పరీక్షల నుండి 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. 2026లో 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం మాత్రం పాత పద్ధతిలోనే జరుగుతుంది," అని సిబిఎస్‌ఈ పరీక్షల నియంత్రణాధికారి సన్యం భరద్వాజ్ పేర్కొన్నారు.
ఈ చర్య వల్ల సమన్వయం మెరుగుపడుతుందని, మానవ జోక్యం తగ్గుతుందని మార్కుల లెక్కింపులో పొరపాట్లు ఉండవని ఆయన వివరించారు.
"డిజిటల్ మార్కింగ్ విధానం కేవలం పర్యావరణ హితమే కాకుండా, ఎక్కువ మంది ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో వేగవంతమైన మూల్యాంకనాన్ని నిర్ధారిస్తుంది. ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లోనే ఉంటూ తమ సాధారణ విధులను కొనసాగించవచ్చు."
"ఫలితాల తర్వాత మార్కుల వెరిఫికేషన్ ప్రక్రియ ఇకపై అవసరం ఉండదు, దీనివల్ల వెరిఫికేషన్ కోసం అవసరమయ్యే సిబ్బంది సంఖ్య కూడా తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ పాఠశాలల ఉపాధ్యాయులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేస్తూ, మూల్యాంకనంలో ప్రతి పాఠశాల సహకారం అందించే అవకాశం కలుగుతుంది," అని ఆయన అన్నారు.
మూల్యాంకనం కోసం నిర్దేశించిన సిస్టమ్ స్పెసిఫికేషన్లతో కూడిన కంప్యూటర్ ల్యాబ్‌లు, నమ్మకమైన ఇంటర్నెట్ కనెక్షన్, నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా చూడాలని పాఠశాలలను కోరారు.
"ఈ తరగతులకు బోధించే ఉపాధ్యాయుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని పాఠశాలలకు సూచించాం. బోర్డు ఆదేశాలను పాటించని పక్షంలో, దానిని మూల్యాంకన ప్రక్రియను దెబ్బతీసే ప్రయత్నంగా పరిగణిస్తాము. సదరు పాఠశాల ఫలితాలను ప్రకటించము," అని భరద్వాజ్ హెచ్చరించారు.
భారతదేశం మరియు 26 ఇతర దేశాల్లో సిబిఎస్‌ఈ ఏటా 10 మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహిస్తుంది, దీని ద్వారా దాదాపు 46 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం
ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో విద్యార్థుల సమాధాన పత్రాలను స్కాన్ చేసి డిజిటల్ రూపంలోకి మారుస్తారు. ఈ డిజిటల్ కాపీలను ఉపాధ్యాయులు కంప్యూటర్ తెరపై చూస్తూ దిద్దుతారు. మార్కుల లెక్కింపు సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమేటిక్‌గా జరుగుతుంది కాబట్టి, గతంలో భౌతిక పద్ధతిలో జరిగే కూడిక పొరపాట్లు ఈ విధానంలో పూర్తిగా నివారించబడతాయి. అయితే ఈ మార్పు ప్రస్తుతానికి 12వ తరగతికే పరిమితమని, 10వ తరగతి జవాబు పత్రాలను యధావిధిగా భౌతిక పద్ధతిలోనే దిద్దుతారని బోర్డు స్పష్టం చేసింది.
ఉపాధ్యాయులకు వెసులుబాటు
కొత్త విధానం వల్ల ఉపాధ్యాయులకు రవాణా సమయం, ఖర్చులు ఆదా అవుతాయి. గతంలో మూల్యాంకనం కోసం ప్రత్యేక కేంద్రాలకు వెళ్లాల్సి ఉండగా, ఇప్పుడు ఉపాధ్యాయులు తమ సొంత పాఠశాలల్లోనే ఉండి, సాధారణ విధులకు ఆటంకం కలగకుండానే ఈ పనిని పూర్తి చేయవచ్చు. దీనివల్ల మూల్యాంకనం వేగంగా పూర్తవడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబిఎస్‌ఈ అనుబంధ పాఠశాలల ఉపాధ్యాయులందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే అవకాశం లభిస్తుంది.
విద్యార్థులకు చేకూరే ప్రయోజనం
ఫలితాల వెల్లడి అనంతరం విద్యార్థులు మార్కుల వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవసరం ఇకపై ఉండదు. డిజిటల్ మదింపు వల్ల ఫలితాలు అత్యంత ఖచ్చితంగా ఉండటమే కాకుండా, పర్యావరణ హితంగా (పేపర్ వినియోగం తగ్గిస్తూ) ఈ ప్రక్రియ సాగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న బోర్డు పరీక్షలకు భారత్ సహా 26 దేశాల్లో దాదాపు 46 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
పాఠశాలలకు మౌలిక సూచనలు
ఈ నూతన విధానం సజావుగా సాగడానికి పాఠశాలలు తమ కంప్యూటర్ ల్యాబ్‌లలో అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని బోర్డు ఆదేశించింది. కనీసం 4 జీబీ రామ్, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని పేర్కొంది. ఉపాధ్యాయులకు ఈ విధానంపై పూర్తి అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు, ఇన్స్ట్రక్షనల్ వీడియోలు, సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కాల్ సెంటర్లను కూడా సిబిఎస్‌ఈ ఏర్పాటు చేస్తోంది.
