Let's talk: editor@tmv.in
సినీ ప్రియుల‌కు షాకిచ్చిన ట్రంప్‌!

సినీ ప్రియుల‌కు షాకిచ్చిన ట్రంప్‌!

Venkatesh Balusula
30 సెప్టెంబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అమెరికాలో విదేశీ చిత్రాల‌పై వంద‌ శాతం సుంకం విధిస్తానని ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. "మా సినిమా వ్యాపారాన్ని అమెరికా నుంచి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది ఒక బిడ్డ నోట్లో క్యాండీ తీసుకోవడం లాంటిది" అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో కాలిఫోర్నియా తీవ్రంగా న‌ష్టపోయిన‌ట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమొక్రట్ గవర్నర్ గావిన్ న్యూసమ్‌ బలహీనుడు, అనర్హుడంటూ ట్రంప్‌ విమర్శించారు. ఈ దీర్ఘకాల సమస్యను పరిష్కరించడానికి అమెరికా బయట రూపొందించిన‌ అన్ని సినిమాలపై వంద‌ శాతం సుంకం విధిస్తాన‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు.

ట్రంప్ నిర్ణ‌యం భారత చిత్ర ప‌రిశ్ర‌మ‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. అమెరికాలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అక్కడ భారతీయ‌ సినిమాలకు మార్కెట్ బాగా ఉంది. భారత్ వివిధ భాషల్లో సినిమాలు తీస్తుంది. వీటి కోసం అమెరికాలోని భారతీయులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తుంటారు. 2017 ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం భారతీయ భాష‌ల్లో రూపొందించిన‌ సినిమాలు అమెరికా, కెనడాలో భారీ వ్యాపారం చేశాయి. ఇవి సాధారణంగా 8 మిలియన్ డాలర్లు ఆదాయాన్ని స‌మ‌కూరుస్తున్నాయి. కొన్నిసార్లు 10 మిలియన్ డాలర్లు మించి ఆదాయం స‌మ‌కూరుతోంది. భారత చిత్రకారులు, అమెరికా, కెనడా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ ప్రేక్షకులకు స‌రైన‌ సేవలందిస్తారు. ఎప్పుడైనా వెయ్యికి పైగా స్క్రీన్లు భారత సినిమాలకు కేటాయిస్తారు. ఆ తర్వాత అమెరికాలో భారతీయ‌ సినిమాల ఆదాయాలు గణనీయంగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్ విదేశీ సినిమాల‌పై వంద శాతం సుంకం విధిస్తే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు ఆ ఖర్చును ప్రేక్షకులకు భారంగా మారుస్తారు. టికెట్ ధరలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు ప‌ది డాల‌ర్లు ఉన్న టికెట్ ధ‌ర 20 డాల‌ర్ల‌కు మారవచ్చు. ఇది థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్షకుల సంఖ్యను తగ్గిస్తుంది. ఫ‌లితంగా వ‌సూళ్లు త‌గ్గుతాయి. భారతీయ సినిమాలు ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు అమెరికా మార్కెట్ చాలా ముఖ్యం. అమెరికాలో లక్షలాది మంది భారతీయులున్నారు. వార్షికంగా భారతీయ సినిమాలు అమెరికాలో సుమారు 100 మిలియన్ డాలర్లు వసూలు చేస్తాయి. డిస్ట్రిబ్యూటర్లు వంద శాతం సుంకం చెల్లించాల్సి వ‌స్తే భారతీయ‌ సినిమాలు అమెరికాలో విడుదల చేయడం అసాధ్యమ‌వుతుంది.

ఇదే సమయంలో ట్రంప్ ఫర్నీచర్ దిగుమ‌తుల‌పై భారీగా సుంకాలు విధిస్తానని ప్రకటించారు. "ఉత్తర కరోలినా రాష్ట్రం చైనా, ఇతర దేశాలకు తన ఫర్నీచర్ వ్యాపారాన్ని కోల్పోయింది. దాన్ని మళ్లీ పున‌రుద్ధ‌రించ‌డానికి అమెరికాలో ఫర్నీచర్ తయారు చేయని దేశాలపై పెద్ద సుంకాలు విధిస్తాను. త్వరలో వివ‌రాలు వెల్ల‌డిస్తాను" అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ ఇటీవ‌ల ఔష‌ధాల‌పై వంద శాతం సుంకాలు విధించారు. అక్టోబర్ 2025 నుంచి బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔష‌ధ ఉత్ప‌త్తుల‌పై 100 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ చెప్పారు. కానీ అమెరికాలో ఫార్మా ప్లాంట్ నిర్మించిన కంపెనీలకు మినహాయింపునిచ్చారు. ఈ వంద‌ శాతం సుంకాలు పేటెంటెడ్, బ్రాండెడ్ ప్రొడక్ట్స్‌పై మాత్రమే ఉంటాయ‌ని, జెనరిక్ మెడిసిన్‌లకు కాద‌ని భార‌త్ స్ప‌ష్టం చేసింది. ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 50 శాతం సుంకాలు విధించింది.

ఇందులో రష్యన్ ఆయిల్ కొనుగోళ్లపై 25 శాతం సుంకం ఉంది. అమెరికా విదేశాల‌పై విధిస్తున్న సుంకాల్లో ఇదే అత్య‌ధికం. భారత్ చ‌మురు కొనుగోళ్లు జాతీయ విధానం, మార్కెట్ అవ‌స‌రాల నిమిత్తం జరుగుతాయని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు సుంకాల మార్పు కోసం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ నేతృత్వంలో ఒక బృందం గత వారం న్యూయార్క్‌లో అమెరికా అధికారులతో సమావేశాలు నిర్వహించింది. ఇప్పటికీ సుంకాల‌లో ఎలాంటి మార్పు రాలేదు. కాగా, అమెరికా మాత్రం ర‌ష్యా చ‌మురు కొనుగోళ్ల అంశంలో వెన‌క్కి త‌గ్గితేనే సుంకాలు త‌గ్గిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో చ‌ర్చ‌లు ఏమేర‌కు ఫ‌లితాలు ఇస్తాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. హెచ్‌1బీ వీసాల ద‌ర‌ఖాస్తు రుసుము పెంపు మొద‌లుకొని సినిమాల‌పై సుంకం వ‌ర‌కు ట్రంప్ తీసుకుంటున్న ప్ర‌తి నిర్ణ‌యం భార‌త్‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ఇది వ్యూహాత్మకంగా జ‌రుగుతుందా? లేదా యాధృచ్ఛిక‌మా అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

సినీ ప్రియుల‌కు షాకిచ్చిన ట్రంప్‌! - Tholi Paluku