
సినీనటి ప్రత్యూష మృతి కేసు.. లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డికి సుప్రీం ఆదేశం
2002లో తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో దోషిగా తేలిన వ్యక్తి తనను కేసు నుంచి తప్పించాలని, తన శిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని అతనికి ఆదేశించింది. న్యాయమూర్తులు రాజేష్ బిందల్, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో గొంతు నులిమి హత్య లేదా అత్యాచారం జరిగిందన్న ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ప్రత్యూష తల్లి పి. సరోజిని దేవి దాఖలు చేసిన పిటిషన్‌నూ కోర్టు తోసిపుచ్చింది. గొంతు నులిమి హత్య జరిగినట్టు నిర్ధారణ కాలేదు. ప్రత్యక్ష సాక్ష్యాలు, వైద్య ఆధారాలు విషప్రయోగం వల్లే మరణం సంభవించిందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అపీలుదారుపై అత్యాచార ఆరోపణలు కూడా రుజువు కాలేదు. కేసు ఇంత ఆలస్య దశలో ఉన్నప్పుడు మరణానికి కారణం అత్యాచారం, గొంతు నులిమి అని వాదించడం సాధ్యం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ప్రత్యూష 2002 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో మరణించారు. ఈ కేసులో జి. సిద్ధార్థ రెడ్డి దోషిగా తేలారు. 2004లో ట్రయల్ కోర్టు ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. అదనంగా ఆత్మహత్యాయత్నం కేసులో మరో ఏడాది జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. అయితే 2011లో ఏపీ హై కోర్టు ఆయన శిక్షను ఐదేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇప్పుడు స్పష్టమైన నిర్ణయం వెల్లడించింది.
రిమాండ్ రిపోర్టు ప్రకారం, సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఈ సంబంధాన్ని ప్రత్యూష తల్లి అంగీకరించినప్పటికీ, సిద్ధార్థ రెడ్డి తల్లి వివాహానికి ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ కారులో వెళ్లి పురుగుమందు కొనుగోలు చేసి, కోక్‌లో కలుపుకొని సేవించారు. అయితే తర్వాత జీవించాలనే నిర్ణయానికి వచ్చి, హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రత్యూష ప్రాణాలు దక్కలేదు. సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కేసు ప్రారంభం నుంచే వివాదాస్పదంగా మారింది. హత్య, అత్యాచారం కోణాల్లో కూడా ఆరోపణలు వినిపించాయి. అయితే వైద్య నివేదికలు, సాక్ష్యాలు విషప్రయోగం వల్లే మరణం సంభవించిందని స్పష్టం చేస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. తాజా తీర్పుతో ఈ కేసుకు సంబంధించి న్యాయపరమైన అనిశ్చితి కొంతవరకు నివృత్తి అయినట్లైంది. కోర్టు ఆదేశాల మేరకు దోషి నాలుగు వారాల్లో లొంగిపోవాల్సి ఉంది.
