Let's talk: editor@tmv.in
సినిమాలకు ‘దళపతి విజయ్’ వీడ్కోలు

సినిమాలకు ‘దళపతి విజయ్’ వీడ్కోలు

Pinjari Chand
29 డిసెంబర్, 2025

తన అభిమానులు తనకు అన్నీ ఇచ్చారని, చివరికి ఒక ‘కోటై’ (కోట/బలమైన కంచుకోట) కూడా కట్టారని పేర్కొన్న ప్రముఖ నటుడు, టీవీకే వ్యవస్థాపకుడు, రాజకీయ నాయకుడు విజయ్. అభిమానుల కోసం నిలబడేందుకే సినిమాకు వీడ్కోలు పలుకుతున్నాను అని భావోద్వేగంగా ప్రకటించారు. మలేషియాలోని కౌలాలంపూర్ సమీపంలోని బుకిట్ జలిల్ స్టేడియంలో నిర్వహించిన తన చివరి సినిమా ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ వేడుకలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం దాదాపు లక్ష మంది అభిమానులతో నిర్వహించారు. భారీగా అభిమానులు తరలి రావడంతో ఈ వేడుక మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తమిళనాడులో ‘కోటై’ అనే పదం కేవలం ఒక బలమైన ఆధారాన్ని మాత్రమే కాకుండా, రాష్ట్ర శాసనసభ, సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్ ను కూడా సూచిస్తుందని విజయ్ గుర్తు చేశారు.

సినిమాలోకి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న ఇసుక ఇల్లు కట్టుకుంటున్నానని అనుకున్నాను. కానీ మీరు నాకో రాజభవనం కట్టారు. అభిమానులే నాకో కోట కట్టారు. అందుకే, నాకు అన్నీ ఇచ్చిన అభిమానుల కోసం నిలబడాలని నిర్ణయించుకున్నాను. వారు నా కోసం అన్నీ వదిలేశారు. అందుకే నేను సినిమానే వదిలేస్తున్నానని విజయ్ అన్నారు.

బలమైన శత్రువు అవసరం

ప్రపంచంలో శ్రీలంక తర్వాత అత్యధికంగా తమిళుల వలస జనాభా ఉన్న దేశం మలేషియా. అక్కడి అభిమానులను ప్రత్యేకంగా ప్రశంసించిన విజయ్ జీవితంలో విజయం సాధించాలంటే మిత్రులు అవసరం కాకపోవచ్చు, కానీ ఒక బలమైన శత్రువు అవసరం. బలమైన శత్రువు ఉన్నప్పుడే మనం మరింత బలపడతాం. 2026లో చరిత్ర తిరిగి రాస్తాం. ప్రజల కోసం దానికి సిద్ధమవుదామని వ్యాఖ్యానించారు.

వీడ్కోలు వేడుక

‘తలపతి తిరువిళా(విజయ్ సినీ ప్రయాణానికి వీడ్కోలు తెలిపే భారీ అభిమానుల వేడుక)’గా పేరు పొందిన ఈ ఐదు నుంచి ఆరు గంటల కార్యక్రమం, రాజకీయ ప్రసంగాలకు అనుమతి లేకుండా, కేవలం వినోద కార్యక్రమంగానే నిర్వహించారు. మలేషియా పోలీసుల కఠిన భద్రత నడుమ ఈ వేడుక సాగింది. గాయకులు టిప్పు, అనురాధ శ్రీరామ్, సైంధవి లైవ్ ప్రదర్శనలతో అభిమానులను ఉత్సాహపరిచారు. ఇప్పటికే ప్రజాదరణ పొందిన తలపతి కచేరి, ఒరు పేరే వరలారు వంటి పాటలు వేడుకకు మరింత ఉత్సాహాన్ని తెచ్చాయి.

భావోద్వేగ ప్రసంగాలు

విజయ్ 33 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి విలక్షణ నటుడు నాజర్ భావోద్వేగంతో విజయ్ గురించి మాట్లాడారు. తన కుమారుడి ఆరోగ్య సమస్యల సమయంలో విజయ్ ఇచ్చిన సహాయాన్ని గుర్తుచేస్తూ, నడిగర్ సంఘం భవన నిర్మాణానికి ఆయన చేసిన తోడ్పాటును ప్రశంసించారు. విజయ్ ప్రసిద్ధ డైలాగ్ ఒరు తడవ ముడివు పన్నిటా ను ప్రస్తావిస్తూ, ఈసారి మాత్రం తన సినిమా వీడ్కోలు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆయన కోరారు. నటి పూజా హెగ్డే విజయ్ వినయశీలతను గుర్తుచేస్తూ, ‘బీస్ట్’ సినిమాలోని అరబిక్ కుత్తు పాట తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిందని తెలిపారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ విజయ్ హిట్స్‌తో కూడిన 45 నిమిషాల ప్రత్యేక మెడ్లీ ప్రదర్శన ఇచ్చారు. దర్శకులు అట్లీ, నెల్సన్, లోకేష్ కనగరాజ్ తమ అనుభవాలను పంచుకున్నారు.

జన నాయగన్’ విడుదల వివరాలు

పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు, ప్రకాశ్ రాజ్, గౌతమ్ మీనన్, ప్రియమణి, నరేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘జన నాయగన్’ చిత్రం జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా పొంగల్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’, శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ చిత్రాలతో బాక్సాఫీస్ పోటీలో నిలవనుంది. ఈ ఆడియో లాంచ్ కార్యక్రమం జీ తమిళ్ ఛానల్‌లో జనవరి 4, 2026న ప్రసారం కానుంది.

సినిమాలకు ‘దళపతి విజయ్’ వీడ్కోలు - Tholi Paluku