
సిద్దిపేటలో జునో జూల్ బయో-గ్యాస్ ప్రాజెక్ట్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రం సుస్థిర ఇంధన వనరుల దిశగా మరో కీలక అడుగు వేసింది. జూనో జూల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కీలక అడుగు వేసింది. సిద్ధిపేట జిల్లాలోని నర్మెట్ట ఇండస్ట్రియల్ ఏరియాలో తమ ప్రతిష్ఠాత్మక బయో-గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్ట్‌కు సంస్థ ఆదివారం భూమిపూజ నిర్వహించింది.
వ్యవసాయ వ్యర్థాలు, జంతు వ్యర్థాలను శుభ్రమైన ఇంధనంగా మారుస్తూ దేశంలోని పునరుత్పాదక ఇంధన వ్యవస్థకు తోడ్పడే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ఇది వృత్తాకార ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ)ను బలోపేతం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడనుంది. ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా అమలు కానుంది. మొత్తం 10 సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ప్లాంట్ రోజుకు 10 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం (టీపీడీ) కలిగి ఉండగా, మొత్తం క్లస్టర్ సామర్థ్యం రోజుకు 100 టన్నులుగా ఉంటుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్‌లో సుమారు రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.
మొదటి దశలో నర్మెట్ట వద్ద మూడు బయో-గ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ దశకు మాత్రమే సుమారు రూ.210 కోట్ల పెట్టుబడి కేటాయించారు. ఈ కేంద్రాన్ని రాష్ట్రంలో స్కేలబుల్ బయో-ఎనర్జీ ఉత్పత్తికి ప్రధాన హబ్‌గా అభివృద్ధి చేయాలన్నది సంస్థ లక్ష్యం. ప్రాజెక్ట్‌ను మూడు దశల్లో అమలు చేయనున్నారు. మొదటి దశలో 3 ప్లాంట్లు, రెండో దశలో 3 ప్లాంట్లు, మూడో దశలో 4 ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం ప్రాజెక్ట్‌ను 2029–2030 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు.
కేంద్ర ప్రభుత్వ సీబీజీ–సీజీడీ సమన్వయ పథకం కింద ఈ ప్రాజెక్ట్ అమలవుతోంది. ఈ పథకం ద్వారా ఉత్పత్తి అయ్యే బయో గ్యాస్‌ను సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీబీజీ) నెట్‌వర్క్‌లోకి అనుసంధానం చేయడం లక్ష్యం. ఈ ప్లాంట్లలో పంటల అవశేషాలు ముఖ్యంగా వరి గడ్డి, అలాగే కోళ్ల వ్యర్థాలు, పశువుల పేడ వంటి సేంద్రియ వ్యర్థాలను ఉపయోగించి కాంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తి చేస్తారు. దీంతో పంట కోత తర్వాత గడ్డి కాల్చడం వల్ల కలిగే వాయు కాలుష్యం తగ్గడమే కాకుండా గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు కూడా తగ్గుతాయని సంస్థ తెలిపింది.
మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసలు
భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇటువంటి ప్రాజెక్టులు పర్యావరణ సవాళ్లను పరిష్కరించడమే కాకుండా, మన రైతులు, స్థానిక వర్గాలకు కొత్త ఆర్థిక అవకాశాలను కల్పిస్తాయి. క్లీన్ ఎనర్జీ, గ్రామీణాభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు.
జునో జూల్ సీఈవో నాగశరత్ రాయపాటి మాట్లాడుతూ, ఈ క్లస్టర్ విధానం ద్వారా దేశ ఇంధన భద్రతకు సహకరిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ విక్రయం కోసం ఇప్పటికే గెయిల్, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. తద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రవాణా, పారిశ్రామిక అవసరాలకు ఈ శుద్ధ ఇంధనం సరఫరా కానుంది.ఈ ఒప్పందాలు ప్రాజెక్ట్‌కు డిమాండ్ భద్రతను అందించి ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని కల్పిస్తాయని సంస్థ వెల్లడించింది.
