
సిద్దిపేటపై కక్ష వీడండి... సీఎం రేవంత్ రెడ్డికి హరీష్‌రావు బహిరంగ లేఖ
జిల్లా అభివృద్ధి అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే టి. హరీష్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేట అభివృద్ధిపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను రద్దు చేసిన ముఖ్యమంత్రి, ఏ మొహం పెట్టుకొని ఇక్కడ అడుగు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.1070.73 కోట్ల నిధులు కేటాయించగా, వాటిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం వల్ల అనేక పనులు నిలిచిపోయాయని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రారంభమైన పనులకు కూడా నిధులు విడుదల చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల గత 27 నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయని ఆయన తెలిపారు.
సిద్దిపేట అభివృద్ధిపై గతంలో చేసిన విమర్శలు, ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు సిద్దిపేటలో ఒక్క ముఖ్యమైన అభివృద్ధి పనైనా చేపట్టిందా అని ప్రశ్నించారు. రద్దు చేసిన నిధులను వెంటనే పునరుద్ధరించి, ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
పామ్ ఆయిల్ ఫ్యాక్టరీపై స్పష్టత
ఈనెల 22 న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట లో రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించిన నిధులు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని హరీష్ రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ కొత్తగా ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు.
రద్దు కారణంగా నిలిచిపోయిన ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వెటర్నరీ కళాశాల, రంగనాయకసాగర్ టూరిజం అభివృద్ధి, కోమటి చెరువు శిల్పారామం, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్, తోర్నాల వ్యవసాయ కళాశాల, మిట్టపల్లి మహిళా డిగ్రీ కళాశాల భవనం, స్పోర్ట్స్ హబ్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాలు ఉన్నాయి. అలాగే సిద్దిపేట–ఇల్లంతకుంట ఫోర్ లేన్ రోడ్డు, సిద్దిపేట–కిష్టాపూర్ రహదారి, మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి పలు కీలక ప్రాజెక్టులు కూడా నిలిచిపోయాయని లేఖలో ప్రస్తావించారు. కక్షపూరిత రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.
