
సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. భారత్‌కు చెందిన 8 నెలల గర్భిణి మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 8 నెలల గర్భిణి అయిన భారత సంతతికి చెందిన ఒ మహిళ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. మరికొన్ని వారాల్లో తల్లి కాబోతున్న ఆ మహిళ, ఈ ఘటనలో గర్భస్థ శిశువును కూడా కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.
ఘటన వివరాలు
భారత్‌కు చెందిన 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్ కుటుంబం సిడ్నీలోని హార్న్స్‌బై ప్రాంతంలో నివాసముంటోంది. గత వారం శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల తర్వాత సమన్విత తన భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి జార్జ్ స్ట్రీట్‌లో క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతుండగా ఈ ఘోరం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం, సమన్విత కుటుంబం రోడ్డు దాటుతున్న సమయంలో ఆ దిశగా వస్తున్న కియా కార్నివల్ కారు స్లో అయ్యింది. అయితే కియా కారు వెనుక వేగంగా వస్తున్న బీఎండబ్ల్యూ కారు దాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ వేగం ధాటికి కియా కారు ముందుకెళ్లి, నడుచుకుంటూ వెళ్తున్న సమన్వితను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సమన్విత తీవ్ర గాయాలపాలైంది. తీవ్రంగా గాయపడిన సమన్వితను హుటాహుటిన సమీపంలోని వెస్ట్‌మీడ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అంతేగాక, ఆమె కడుపులోని శిశువును కూడా రక్షించలేకపోయారు.
మృతురాలు సమన్విత ధారేశ్వర్ స్థానికంగా ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆమె అలస్కో యునిఫామ్స్ కంపెనీలో ఐటీ సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
నిందితుడి గుర్తింపు, అరెస్టు
ఈ ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును నడిపిన డ్రైవర్‌ను 19 ఏళ్ల ఆరోన్ పపాజోగ్‌గా శనివారం పోలీసులు గుర్తించారు. పోలీసులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు అతడిపై ప్రమాదకర డ్రైవింగ్ ద్వారా మరణానికి కారణం, నిర్లక్ష్య డ్రైవింగ్ ద్వారా మరణానికి కారణం, గర్భస్థ శిశువు కోల్పోవడానికి కారణం అనే అభియోగాలను మోపారు.
బెయిల్ విచారణ సందర్భంగా మేజిస్ట్రేట్ రే ప్లిబర్సెక్, పపాజోగ్ బెయిల్ దరఖాస్తును తిరస్కరించారు. ఈ సంఘటనను విషాద కేసుగా ఆయన అభివర్ణించారు. ఇది రెండు కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని, బాధితురాలి కుటుంబానికి సమాజం తరఫు నుండి సానుభూతి తెలుపుతున్నామని పేర్కొన్నారు.
