
సిట్ నోటీసులకు సమాధానం ఇస్తా: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా సెగలు రేపుతోంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ తీరుపై, సిట్ దర్యాప్తుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన నిరసనను వ్యక్తం చేసిన 12 గంటల్లోపే సిట్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు.
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ వేదిక ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులకు సంబంధం లేకున్నా నోటీసులు జారీ చేసి, సజ్జనార్ నేతృత్వంలోని రెండో సిట్ గంటల తరబడి విచారణ పేరిట వేధింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని తెలంగాణ భవన్‌లో పత్రికా సమావేశంలో ఖండించిన 12 గంటల్లోపే, అర్ధరాత్రి 12 గంటలకు తన ఇంటికి వచ్చి సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. రెండు రోజుల్లో ఆధారాలతో సమాధానం ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని చెప్పారు.
ప్రజా సమస్యలపై, ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రశ్నించడం తన రాజ్యాంగ హక్కు అని, వార్నింగ్‌లకు భయపడే ప్రసక్తే లేదని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. తన వద్ద ఉన్న సమాచారంతో సమాధానం ఇస్తానని, ఆ తర్వాత ప్రభుత్వానికి ఇష్టమొచ్చినట్లు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్‌పై తాను మీడియా సమావేశంలో చేసిన కీలక వ్యాఖ్యలను మళ్లీ వివరించారు. దేశ రక్షణ, అంతర్గత భద్రత, సంఘటిత నేరాల నివారణ కోసం చట్టపరంగా టెలిఫోన్ ట్యాపింగ్‌కు అనుమతి ఉందని, దీనికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. ఇది ఒక్క అధికారితో జరిగే ప్రక్రియ కాదని, అనేక స్థాయిల్లో పర్యవేక్షణ ఉంటుందని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు అవసరమా అని ప్రశ్నించారు.
సజ్జనార్‌పై మరో సిట్ వేయాలని తాను డిమాండ్ చేశానన్నది పూర్తిగా అసత్యమని ఖండించారు. 2015లో ఓటుకు నోటు కేసు అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై కేసులు నమోదైన విషయాన్ని మాత్రమే ప్రస్తావించానని, ఆ సమయంలో సజ్జనార్ తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేశారన్న నేపథ్యంతో ఆయన రెండో సిట్ చీఫ్‌గా ఉండడం నైతికంగా సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేశానన్నారు.
అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న బొగ్గు కుంభకోణం సహా పలు అవినీతి వ్యవహారాలపై సిట్ వేయాలని డిమాండ్ చేశానని తెలిపారు. కొందరు పోలీసు అధికారులనే లక్ష్యంగా చేసుకుని వేధింపులు చేయడం అన్యాయమని, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ట్యాపింగ్ వ్యవహారం బహిరంగంగా చర్చకు రావడం ప్రమాదకరమని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిత్వ హననం జరిగినా పోలీసులు స్పందించకపోవడం ఎందుకని ప్రశ్నించిన ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.
