
సిట్ ఛార్జిషీట్ తర్వాత ఏకసభ్య కమిటీ ఎందుకు? భూమన కరుణాకర్ రెడ్డి
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై విచారణ జరుపుతున్న సిట్ నివేదికను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించడంపై వైకాపా సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన సిట్ దర్యాప్తు పూర్తయి ఛార్జిషీట్ దాఖలైన తర్వాత మళ్లీ కొత్తగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌తో కమిటీ వేయడం అత్యున్నత న్యాయస్థానాన్ని న్యాయ ప్రక్రియను అవమానించడమేనని ఆయన ఆరోపించారు. శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త నాటకానికి తెరలేపారని భూమన విమర్శించారు. ఎనిమిది రాష్ట్రాల్లో ఏడాది పాటు సాగిన సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో వైకాపా నాయకులకు క్లీన్ చిట్ లభించిందని ఎక్కడా అవకతవకలు జరిగినట్లు నిరూపితం కాలేదని ఆయన పేర్కొన్నారు. సిట్ దర్యాప్తులో తన ఆరోపణలు నిలబడకపోవడంతో, ప్రతిపక్ష నేతలను ఇరికించేందుకు ఏకసభ్య కమిటీ ద్వారా ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటపై వేసిన కమిటీల ఫలితం ఏమైందో అందరికీ తెలుసని ఇవన్నీ ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం సాగుతాయని ఎద్దేవా చేశారు.
హెరిటేజ్ లింకులపై ఆధారాలున్నాయి
లడ్డూ నెయ్యి వివాదంలో అసలు దోషులు ఎవరో ఇప్పటికే ప్రజలకు అర్థమైందని భూమన అన్నారు. 2013-19 మధ్య కాలంలో తక్కువ ధరలకు నెయ్యి సరఫరా చేసిన డెయిరీల వెనుక ఉన్న అసలు శక్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇందాపూర్ డెయిరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో హెరిటేజ్ సంస్థకు ఉన్న సంబంధాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఫిబ్రవరి 10, 2026 వరకు ఇందాపూర్ డెయిరీని హెరిటేజ్ తన తయారీ యూనిట్‌గా గుర్తించిందని, వివాదం తలెత్తగానే మాట మార్చారని ఆరోపించారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఇతర వైకాపా నేతలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీటీడీ మాజీ ఈవో ఏకే సింఘాల్‌ను తొలగించడం మరో అధికారిని సెలవుపై పంపడం వంటి చర్యలు జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికేనని భూమన విమర్శించారు. పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మరోవైపు వైకాపా ఆరోపణలను టీడీపీ నేత ఎం.గురునాథం కొట్టిపారేశారు. హెరిటేజ్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైకాపా కుట్ర చేస్తోందని రూ. 4 కోట్లతో ప్రారంభమైన సంస్థ నేడు రూ. 4,000 కోట్లకు ఎదిగిందని ప్రజలకు ఆ సంస్థపై నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు.
