Let's talk: editor@tmv.in
సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్తా: కవిత

సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్తా: కవిత

Gaddamidi Naveen
3 ఫిబ్రవరి, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుబట్టారు. చట్టం ముందు ఎవరూ అధికులు కారని, విచారణకు సహకరించాల్సింది పోయి ఎదురుదాడి చేయడం సరికాదని ఆమె హితవు పలికారు.

సోమవారం హైదరాబాద్‌లో కవిత మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం విచారణకు పిలిచారు. దీనిపై కేటీఆర్ అనవసరంగా స్పందించారని. ఆయన మాటల్లో, కేసీఆర్‌ను విచారణకు పిలవడమే పెద్ద నేరంగా, అఘాయిత్యంగా చూపించే ప్రయత్నం కనిపించిందని. ప్రజాజీవితంలో ఉన్నవారు అనేక అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చట్టపరమైన ప్రక్రియలను గౌరవించాలని ఆమె వ్యాఖ్యానించారు.

విచారణ పారదర్శకంగా సాగి, నిజం బయటకు రావాలంటే నాయకులు సహకరించాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు. విచారణకు సహకరిస్తేనే కేసుకు ఒక ముగింపు లభిస్తుంది. కేసీఆర్‌ను ఇంతకాలం ఎందుకు విచారణకు పిలవలేదో కూడా పార్టీ అంతర్గతంగా ఆలోచించుకోవాలని ఆమె సూచించారు.సిట్‌ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్‌ చెప్తారని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సిట్‌ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్లి సహకరిస్తాను అని కవిత అన్నారు.

తాను కూడా గతంలో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తప్పు చేయకపోయినా ఈడీ, సీబీఐ విచారణలకు హాజరయ్యానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకత్వం తమ ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోకపోతే పార్టీని ఎవరూ కాపాడలేరని ఆమె వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజం పూర్తిగా వెలుగులోకి రాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్‌కు చెందిన ఓ కీలక నేత మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’ జరుగుతోందని కవిత ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఆమె దాయాది సోదరుడు,, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ. హరీష్ రావును ఉద్దేశించి చేసినవిగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11 దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును పెద్దగా చూపించి, ఎన్నికల తర్వాత దాన్ని పక్కన పెడుతుందని కవిత ఆరోపించారు. గత రెండేళ్లుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని, ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా ఉంటే విచారణను ముందుకు తీసుకెళ్లాలని క‌విత‌ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఎంఓయూలపై విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల పేరుతో చేసుకుంటున్న ఒప్పందాలన్నీ (ఎంఓయూలు) నకిలీవని కవిత మండిపడ్డారు. ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటున్న కొన్ని కంపెనీలకు కనీసం వెబ్‌సైట్లు కూడా లేవని ఆమె ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తన తండ్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేలా హరీష్ రావు, సంతోష్ కుమార్‌లు వ్యవహరిస్తున్నారని ఆరోపించినందుకు గాను, కవితను సెప్టెంబర్ 2025లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆమె 'తెలంగాణ జాగృతి' ఆధ్వర్యంలో స్వతంత్రంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజా వ్యాఖ్యలతో కల్వకుంట్ల కుటుంబంలోని అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మరోవైపు కేసీఆర్ విచారణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక అర్థం లేనిదని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు.