
సిట్టింగ్ సీట్ కోల్పోయిన బీఆర్ఎస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఒక నియోజకవర్గ ఫలితమే అయినప్పటికీ, రాష్ట్ర రాజకీయ వాతావరణంపై ప్రస్తుతం గణనీయమైన ప్రభావం చూపుతుంది.బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. అయితే బీఆర్ఎస్ సోంత సిట్టింగ్ సీట్ కోల్పోయారు.గతంలో లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలువలేదు.ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది.దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ ప్రజలలో ఇంకా వ్యతిరేకం ఉందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితంపై ఆత్మవిమర్శతో పాటు, కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు
ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వారికి తోడుగా ప్రతి బూత్‌లో స్థానిక జూబ్లీహిల్స్ పార్టీ శ్రేణులు, నాయకులు కూడా కష్టపడ్డారు. వారందరికీ ధన్యవాదాలు, అని కేటీఆర్ మొదటగా కార్యకర్తలను అభినందించారు. తమ అభ్యర్థి మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేకపోయినా, నాయకులు కష్టపడి పోరాటం చేశారని, సునీతకు కూడా అభినందనలు చెప్పారు. ఎన్నికల్లో పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు, ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల ఫలితంపై సానుకూల దృక్పథం
ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదైందని కేటీఆర్ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో గెలవాలనే పోటీ చేస్తామని, అయినప్పటికీ ఈ ఎన్నిక "కొత్త ఉత్సాహాన్ని, కొత్త బలాన్ని" ఇచ్చిందన్నారు. ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైన ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి అని ప్రజలు తీర్పునిచ్చారని, ఈ అంశాన్ని పార్టీ సానుకూల అంశంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ,2014 నుంచి 2023 వరకు 7 ఉప ఎన్నికలు జరిగాయి. అన్ని ఉప ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఒకటి, రెండు సీట్లకే పరిమితమైంది. ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా, డిపాజిట్లు కోల్పోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ అక్రమాలు, విమర్శలు
ఎన్నికల్లో తమ పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా పోరాడిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ఎలా జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారని, ప్రతి సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సర్వే ఏజెన్సీలు చెప్పాయన్నారు.
కాంగ్రెస్ అక్రమాలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.ఎన్ని రకాలుగా అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో నెల రోజుల ముందు చెప్పాం. స్వయంగా అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండడం, దొంగ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్ మొదలు పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాల గురించి ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేశామని. ఎలక్షన్ కమిషన్,అలాగే పోలీస్ పనితీరుపైనా చర్చ జరగాలని, ఈ విధంగా ఎన్నికలు జరిగిన తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
కేటీఆర్ బీజేపీ తీరుపైనా స్పందిస్తూ, సింగిల్ డిజిట్‌లో ఉండి డిపాజిట్ బీజేపీ కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నదని ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం బానే వర్కౌట్ అయినట్టు కనిపించిందని ఆయన ఆరోపించారు.
ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పోరాటం
ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారెంటీల అమలును, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయాము. కులము, మతము పేరుతో రాజకీయం చేయలేదు. ప్రజలకు అవసరమైన అంశాలను మాత్రమే ప్రచారంలో చర్చకు పెట్టామని బీఆర్ఎస్ వ్యూహాన్ని కేటీఆర్ వివరించారు.
ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ,ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బూతులు మాట్లాడినా, ప్రచారం సందర్భంగా మేము హుందాగా ఉన్నామని. 5300 కోట్ల అభివృద్ధిని నియోజకవర్గానికి చేశామని ప్రజల ముందుకు పెట్టామని. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టిన ప్రతి ఒక్క అంశాన్ని 'బాకీ కార్డు' రూపంలో ప్రజల ముందుకు తీసుకుపోయాం అని కేటీఆర్ తెలిపారు. తమ ఒత్తిడి కారణంగానే గ్యారెంటీల అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష చేసే స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చామని, మైనారిటీలకు మంత్రివర్గంలో స్థానం లేదని, ఆటోలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తడంతో ప్రభుత్వం ఒత్తిడికి లోనై వారికి స్థానం కల్పించాల్సి వచ్చిందని కేటీఆర్ అన్నారు.
భవిష్యత్తు లక్ష్యం
ఈ ఎన్నిక ఫలితం పైన కూడా ఆత్మ విమర్శ చేసుకుంటాం. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని ప్రజలు నిరూపించారు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నిక ఫలితం వలన నిరాశ చెందకుండా, మా పనిని ప్రధాన ప్రతిపక్షంగా చేసుకుంటూ పోతూనే ఉంటామని, ప్రజలతోనే ఉంటామని ప్రజల కోసమే ఉంటామని,అలాగే తిరిగి కేసీఆర్‌ని ముఖ్యమంత్రి చేసుకునేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని, ప్రతిజ్ఞ చేశారు.
ఉపఎన్నికల అంచనా వేస్తూ పశ్చిమ బెంగాల్లో జరిగిన మాదిరిగానే, ఇక్కడ కూడా పార్టీ మారిన నేతలను డిస్క్వాలిఫై చేసి ఉప ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నామని, "ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకే ఇన్ని అపసోపాలు పడిన కాంగ్రెస్ పార్టీ, 10 ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తాం," అని కేటీఆర్ హెచ్చరించారు. చివరగా, పార్టీ విజయం కోసం దీపావళి వంటి పండగను కూడా పక్కన పెట్టి పనిచేసిన హరీష్ రావు, రవీందర్ రావు సహా ప్రతి ఒక్క పార్టీ నేతకు, కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
