Let's talk: editor@tmv.in
సిజిఎఫ్‌ నిధులతో ఆలయాల అభివృద్ధికి ఊతం:మంత్రి అనం నారాయణ రెడ్డి

సిజిఎఫ్‌ నిధులతో ఆలయాల అభివృద్ధికి ఊతం:మంత్రి అనం నారాయణ రెడ్డి

Panthagani Anusha
10 ఏప్రిల్, 2026

రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను పెంపొందించేందుకు పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో కామన్ గుడ్ ఫండ్ (సిజిఎఫ్) నిధుల వినియోగంపై ఉన్నతాధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. ఆలయాల అభివృద్ధి, పెండింగ్ పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి నిధుల వినియోగంలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు.

శిథిలావస్థలో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యం

రాష్ట్రంలోని చారిత్రక, పురాతన ఆలయాల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అనం తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఆలయాలను తక్షణమే గుర్తించి అత్యవసర పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా అందిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి అవసరమైన చోట అదనపు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సాంప్రదాయ శిల్పకళ ఉట్టిపడేలా నిపుణులైన స్థపతుల పర్యవేక్షణలో పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.

ధూపదీప నైవేద్య పథకంపై ప్రత్యేక దృష్టి

ఆదాయం లేని చిన్న ఆలయాల్లోనూ నిత్య పూజలు విఘాతం కలగకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం 'ధూపదీప నైవేద్య' పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అర్చకుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిధుల విడుదల ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.

గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్రణాళిక

రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, శానిటేషన్, భద్రతా ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో ఆలయాల మధ్య సమన్వయం ఉండాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్, కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఇంజనీర్ శేఖర్, స్థపతి పరమేశ్వర్ తో పాటు పలువురు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.